సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, రుణమాఫీ, పెట్టుబడి రాయితీ, పంటలకు మద్దతు ధర, సాగు పనిముట్లు, పౌల్ట్రీ పరిశ్రమకు రాయితీలు, ఏడు గంటల విద్యుత్ సరఫరా సహా ఏ అంశంపైనైనా.. కేసీఆర్ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
“కేటీఆర్ ఓకే.. డిబేట్ ఎక్కడ? ఎప్పుడు.. రెడీ!“ అని ఆయన ప్రకటించారు. రైతులకు రూ.70 వేల కోట్ల రుణాలను ఏకకాలంలో మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని రేవంత్‌రెడ్డి చెప్పారు.
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సవాల్‌ను కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2004 నుంచి 2014 వరకు రైతు సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
అదే విధంగా 2014 నుంచి ఇప్పటి వరకు రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో కూడా చర్చించేందుకూ తాము సిద్ధమని రేవంత్ చెప్పారు. వేదిక, తేదీ, సమయం ఎక్కడో కేటీఆర్ ప్రకటిస్తే తాము వస్తామని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి తనతోపాటు కిసాన్ కాంగ్రెస్ ప్రతినిధులు కోదండరెడ్డి, అన్వేష్‌రెడ్డిలతో పాటు సీనియర్ నాయకులు పాల్గొంటారని రేవంత్ చెప్పారు. ప్రభుత్వం తరఫున కేటీఆర్‌తోపాటు అవసరమైన యంత్రాంగాన్ని, నాయకులను వెంట తెచ్చుకోవచ్చన్నారు.
గతంలో పలుసార్లు సవాల్ విసిరి.. కేటీఆర్ వెనక్కు పోయిన సందర్భాలు ఉన్నాయని ఇప్పుడూ అదే జరుగుతుందన్న అనుమానం వ్యక్తం చేశారు.
మూడు సంవత్సరాల్లో 75 వేల మంది రైతులు చనిపోయినట్లు… రైతు బీమా వివరాలను ప్రభుత్వమే వెల్లడించిందన్నారు. ఇంత మంది రైతులను బలికొన్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని రేవంత్ నిప్పులు చెరిగారు.
‘వేల కోట్ల విద్యుత్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్‌ను ఇచ్చింది. రైతులకు ఉచిత విద్యుత్‌ను ఇవ్వొచ్చని ముందుగా నిరూపించింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు రూ.70 వేల కోట్ల రుణాలను ఏకకాలంలో మాఫీ చేసింది.
పంటలకు మద్దతు ధరలను భారీగా పెంచింది కాంగ్రెస్ పార్టీ. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీని మించింది లేదు. 2004 నుంచి 2014 వరకు రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తెచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 90 శాతం రాయితీపై వ్యవసాయ పనిముట్లను ఇచ్చింది.“ అని రేవంత్ అన్నారు. మరి రేవంత్ సవాల్‌కు కేటీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.