తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ హఠాత్తుగా వీఆర్ఎస్ తీసుకోవడంపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకే ఆయన అర్ధాంతరంగా సర్వీసు నుంచి వైదొలిగారని ప్రచారం జరిగింది. ఇటీవల ఔరంగాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ వేదికపై సోమేశ్ కుమార్ ను కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తడం కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా కేసీఆర్ ముఖ్య సలహాదారుగా సోమేశ్ కుమార్ ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, సోమేశ్ కుమార్ కు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్టు ఆ ఉత్తర్వులలో పేర్కొంది. మూడేళ్ల కాట్ మూడేళ్ల పాటు సోమేశ్ కుమార్ ఈ పదవిలో కొనసాగనున్నారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ లో సోమేశ్ కుమార్ చక్రం తిప్పబోతున్నారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కు నమ్మినబంటుగా ఉన్న సోమేశ్ కుమార్ బీహార్ లోని మధుబని లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి ఐఏఎస్‌గా సోమేశ్ కుమార్ పదవీకాలం ఈ ఏడాది డిసెంబరు చివరి వరకూ ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కేడర్ కు నియమితులయ్యారు. కానీ, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన ఆయన తెలంగాణలో పనిచేయడానికి అనుమతి పొందారు. చివరకు అది వివాదాస్పదమై ఈ ఏడాది జనవరిలో ఆయన ఏపీ కేడర్‌గా వెళ్లిపోవాల్సి వచ్చింది. జనవరి 12న ఏపీ సీఎం జగన్ ను కలిసిన సోమేశ్ కుమార్ లాంఛనంగా ఆ రాష్ట్ర కేడర్ ఐఏఎస్ గా జాయిన్ అయ్యారు.
కానీ, నెల రోజులు దాటినా ఆయనకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో, ఆయన వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 17న ఆ దరఖాస్తుకు ఆమోదం దొరకడంతో రిటైరయ్యారు.