గుడివాడలో క్యాసినో వ్యవహారం జాతీయ స్థాయిలో పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నాని తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని గుడివాడలో గోవా కల్చర్ తెచ్చారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇక, నానికి చెందిన ఎన్ కన్వెన్షన్ లో క్యాసినోతోపాటు పోకర్ వంటి జూద క్రీడలు నిర్వహించారని, వాటిపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు టీడీపీ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ గుడివాడలో పర్యటించింది. అయితే, తమ గుట్టు రట్టవుతుందన్న కారణంతో ఆ కమిటీని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. టీడీపీ నేతలు బొండా ఉమతోపాటు మరికొందరిపైనా దాడి చేశాయి. ఈ క్రమంలోనే గుడివాడలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబుకు నివేదిక సమర్పించారు.
ఇక, తాజాగా ఆ నివేదికను ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ కు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అందజేసింది. గుడివాడలో జూదం నిర్వహించారని గవర్నర్కు కమిటీ నేతలు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, క్యాసినోకు సంబంధించిన కరపత్రాలు, వీడియోలు, ఫొటోలు, ఆధారాలను గవర్నర్కు సమర్పించారు. గుడివాడ పర్యటనలో తమపై దాడి జరిగిందని, ఆ సమయంలో పోలీసులు తమతో ప్రవర్తించిన తీరు, పెట్టిన కేసులపైనా ఫిర్యాదు చేశారు. దీంతోపాటు, తక్షణమే కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు. గవర్నర్ను కలిసిన వారిలో వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, ఆలపాటి రాజా తదితరులు ఉన్నారు.
మరోవైపు, ఈ క్యాసినో వ్యవహారంపై కొడాలి నానిని ఆయన మిత్రుడు వల్లభనేని వంశీ అడ్డంగా బుక్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ లో జూదం జరగలేదని, కానీ, దానికి ఆనుకొని ఉన్న ఓపెన్ ప్లాట్ లో ప్రతి ఏడాదిలాగే కోడి పందేలు గట్రా సంబరాలు జరిగాయని వంశీ అంగీకరించారు. ఇక, ఆ ప్రాంతంలో అసభ్యకర డ్యాన్స్ లు జరుగుతుంటే స్వయంగా నాని…డీఎస్పీకి ఫోన్ చేసి ఆపించారని వంశీ చెప్పారు. కానీ, నాని మాత్రం అసలు ఏమీ జరగలేదని బుకాయిస్తున్నారు. దీంతో, కొడాలి నానిని ఆయన మిత్రుగు వంశీ అడ్డంగా బుక్ చేసినట్లయింది.