ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. 2019 ఎన్నికలకు ముందు మోహన్ బాబు ఆయన తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ లపై కేసు నమోదు అయింది. 2019లో తన కాలేజీ విద్యార్థులతో కలిసి మోహన్ బాబు రోడ్డుపై ధర్నాకు దిగారు. అప్పటికే 2019 ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తిరుపతిలో ఈ ధర్నాతో ట్రాఫిక్ కు భారీగా అంతరాయం కలిగింది.
ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఆందోళన చేసినందుకు మోహన్ బాబుతో సహా ఐదుగురిపై కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణ కోసం మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ లు తిరుపతి కోర్టుకు గతంలో పలుమార్లు హాజరయ్యారు. గత జూన్ లో మోహన్ బాబు తిరుపతి కోర్టుకు విచారణ కావడం చివరిసారి. ఆ సందర్భంగా భారీ జన సందోహం మధ్య పాదయాత్ర చేస్తూ మోహన్ బాబు కోర్టుకు రావడం వివాదాస్పదమైంది.
ఇక, మీడియా అడగక పోయినప్పటికీ తాను బీజేపీ మనిషినని మోహన్ బాబు చెప్పడం చర్చనీయాంశమైంది. ఇక 2021 జూన్ తర్వాత మళ్లీ మోహన్ బాబు కోర్టుకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణను నిలిపివేయాలని కోరుతూ ఇటీవల ఏపీ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు మోహన్ బాబుకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
ఈ కేసు విచారణను ఎనిమిది వారాలపాటు నిలిపివేస్తూ ప్రతివాదులకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి మద్దతు తెలుపుతున్న మోహన్ బాబు టీడీపీకి వ్యతిరేకంగానే ఆ ధర్నా చేశారని టీడీపీ నేతలు అప్పట్లో ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలోనే వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయిన తర్వాత కూడా ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉండడం విశేషం. ఇటీవల వైసీపీతోనూ మోహన్ బాబు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.