దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కవిత పేరు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సౌత్ గ్రూప్ కు ఎమ్మెల్సీ కవితతో పాటు వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు రాఘవరెడ్డి కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే కవితకు వ్యతిరేకంగా ఈడీ అధికారులకు హైదరాబాద్ వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది.
తాను కవిత బినామీనంటూ ఈడీకి పిళ్లై గతంలో వాంగ్మూలం ఇచ్చారు. దానిని ఆధారం చేసుకుని కవితను విచారణ జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రామచంద్ర ఈడీ అధికారులకు షాక్ ఇచ్చారు. ఈడీకి తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ ప్రకారం కోర్టులో తన లాయర్ ద్వారా పిళ్లై పిటిషన్ వేశారు. దీంతో, ఆ పిటిషన్ పై స్పందించాలని హౌస్ అవెన్యూస్ స్పెషల్ కోర్టు…..ఈడీకి నోటీసులు జారీ చేసింది.
మరోవైపు శనివారం నాడు కవితను ఈడి అధికారులు విచారణ జరపనున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే, కాకతాళీయంగా విచారణకు ఒకరోజు ముందు ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ధర్నా చేయడం విశేషం. మరోవైపు, ఈ స్కాంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేత మనీశ్ సిసోడియాను నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, సిసోడియాను ఈడీ అధికారులు నేడు కోర్టులో హాజరుపరిచారు. సిసోడియా తరఫున న్యాయవాదులు దయన్ కృష్ణన్, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపిస్తుండగా… ఈడీ తరఫున ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. విజయ్ నాయర్, సిసోడియా, కవిత తదితరులు లిక్కర్ స్కాంకు కుట్ర పన్నారని ఈడీ తరఫు న్యాయవాది ఆరోపించారు. ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ దాదాపు రూ.100 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు.