ఏపీలో కొద్ది నెలల క్రితం ముగిసిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ అభ్యర్థులను బెదిరించిన వైసీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, బెదిరింపులకు గురిచేసి నామినేషన్లు విత్ డ్రా చేయించారని ఆరోపణలు వచ్చాయి. ఇక, కొన్ని చోట్ల మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎన్నిక విషయంలోనూ వైసీపీ అక్రమాలకు తెరలేపిందని విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలోనే కొండపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక విషయంలో చెలరేగిన వివాదం దుమారం రేపింది. వైసీపీ కౌన్సిలర్లు గొడవ చేయడంతో ఆ ఎన్నిక పలుమార్లు వాయిదా పడిన అనంతరం హైకోర్టు ఆదేశాలతో పూర్తయింది. ఎంపీ కేశినేని నాని తన ఓటు హక్కు వినియోగించుకోవడంపై వైసీపీ నేతలు లేవనెత్తిన అభ్యంతరంపై కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేశినేని నాని తన ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, కానీ, నాని ఓటు హక్కు కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని గతంలోనే తెలిపింది. అప్పటి వరకు ఆ ఎన్నికల ఫలితాలను ప్రకటించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే ఆ వ్యవహారంపై టీడీపీ కౌన్సిలర్లు, కేశినేని నానిలు హైకోర్టులో పిల్ వేశారు. కానీ, ఆ పిల్ కు హైకోర్టులో విచారణ అర్హత లేదంటూ కొండపల్లికి చెందిన వైసీపీ కౌన్సిలర్లు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ కౌంటర్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. కేశినేని నాని దాఖలు చేసిన పిల్కు హైకోర్టులో విచారణ అర్హత ఉందని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
అంతేకాదు కొండపల్లి నగర పంచాయతీ పాలకవర్గం ఎన్నికలో కేశినేని నాని ఓటు హక్కు వినియోగానికి సంబంధించి తామే ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపింది. ఈ వ్యవహారంపై సివిల్ కోర్టుకు వెళ్లాలన్న వైసీపీ కౌన్సిలర్ల అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది.
Comments 1