అమరావతి…ఈ పేరు వింటేనే సీఎం జగన్ కు చిరాకు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్న మాట టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానుల నోట వినిపిస్తుంటుంది. కేవలం ఏపీ రాజధానిగా అమరావతిని చంద్రబాబు ఎంపిక చేశారన్న అక్కసుతో మూడు రాజధానులంటూ జగన్ కొత్త పల్లవి అందుకొని అమరావతి రైతులకు తీరని అన్యాయం చేశారని విపక్ష నేతలు విమర్శిస్తుంటారు.
అందుకే, అమరావతికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ టీడీపీ నేతలను ఇరికించాలని, వారిపై కేసులు పెట్టి ఇబ్బందులపాలు చేయాలని జగన్ పూనుకున్నారని టీడీపీ నేతలు అంటుంటారు. ఈ క్రమంలోనే అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరి నారాయణపై గతంలో కేసులు నమోదయ్యాయి.
అయితే, ఆ కేసులో తాజాగా నారాయణకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ బెయిల్ షరతులలో కొన్నింటిని సవరించాలంటూ హైకోర్టులో నారాయణ తాజాగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన బెయిల్ కు సంబంధించిన షరతులకు జోడించి జారీ చేసిన ఉత్తర్వులలో మార్పు కోరుతూ పిటిషన్ వేశారు. తన వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లాల్సి ఉందని ,ఈ క్రమంలోనే కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరారు.
దీంతో, ఆ లంచ్ మోషన్ పిటిషన్ పై బుధవారంనాడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్పై నారాయణ తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు…నారాయణ అభ్యర్థనను మన్నించింది. నారాయణ ముందస్తు బెయిల్ షరతులను సడలించింది. ట్రీట్ మెంట్ కోసం నారాయణ అమెరికా వెళ్లి వచ్చేందుకు హైకోర్టు అనుమతించింది. నారాయణకు 3 నెలల సమయాన్ని హైకోర్టు కేటాయించింది. హైకోర్టులో ముందస్తు బెయిల్ రావడంతోపాటు అమెరికాలో చికిత్స కోసం మూడు నెలల సమయానికి అనుమతినివ్వడంతో నారాయణకు భారీ ఊరట లభించినట్లయింది.