తనను, తన పాలనను విమర్శించార్న ఒకే ఒక్క కారణంతో రామోజీ రావు ఈనాడు, మార్గదర్శిలపై జగన్ కక్షగట్టారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పై లుక్ ఔట్ నోటీసులు జారీ చేయవద్దని, ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు చెప్పినా…ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో, వారిపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఇక, వెయ్యి కోట్ల ఆస్తులు అటాచ్ చేయడంపై కూడా తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా సరే, మార్గదర్శి చిట్ ఫండ్స్ కు చెందిన పలువురు బ్రాంచి మేనేజర్లను సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
అంతేకాదు, మార్గదర్శికి సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయని, బ్రాంచ్ మేనేజర్లను కొందరిని అరెస్ట్ చేశామని, మరిన్ని కేసులు, అరెస్టులు ఉంటాయని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ సీఐడీ అధికారులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు సూచించింది. రెండ్రోజుల్లో తాము తదుపరి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని, అంతవరకు తనిఖీలు, అరెస్టులు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు, మార్గదర్శి రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ ను జడ్జి ఆదేశాలతో పోలీసులు విడుదల చేశారు. ఆ మేనేజర్ ను ఒకసారి రిమాండ్ కు తీసుకున్న పోలీసులు..మరోసారి రిమాండ్ కోరారు. అయితే, గతంలో రిమాండ్ కోరిన సెక్షన్ పై మరోసారి అరెస్ట్ ఎలా చేస్తారని జడ్జి ప్రశ్నించారు. ఆ కేసులో చార్జిషీట్ కూడా దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అతడిని విడుదల చేశారు. తాజాగా ఏపీ హైకోర్టు తీర్పుతో రామోజీరావుకు, శైలజా కిరణ్ కు భారీ ఊరట లభించింది.