డ్రగ్స్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటుడు నవదీప్ కు సంబంధించి తెలంగాణ హైకోర్టు తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ ఉత్తర్వులతో డ్రగ్స్ కు సంబంధించి నవదీప్ కు ఉన్న సంబంధాలేమిటి? అతడి పాత్ర ఏమిటన్న దానిపై కాస్తంత క్లారిటీ వచ్చేలా ఉండటం గమనార్హం. డ్రగ్స్ కేేసులో నిందితుడైన సినీ నటుడు నవదీప్ పై కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా అతడ్ని విచారించాలంటే సీఆర్ పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని చెప్పింది.
కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ లో డ్రగ్స్ ను.. వాటిని సరఫరా చేసే వారిని పోలీసులు అదుపులోకితీసుకోవటం.. ఈ కేసులో భాగంగా నవదీప్ పై చర్యలు ఉంటాయని హైదరాబాద్ పోలీసు కమిషన్ ప్రెస్ మీట్ లో చెప్పటం తెలిసిందే. అయితే.. తనకు మాదక ద్రవ్యాల సరఫరాకు సంబంధం లేదని నవదీప్ చెప్పటం ఒక ఎత్తు అయితే.. దీనిపై అతడు హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరాడు.
నవదీప్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ కె. సురేందర్ విచారణ చేపట్టారు. నవదీప్ తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా తన క్లయింట్ ను 29వ నిందితుడిగా పేర్కొన్నట్లుగా తెలిసిందని.. అంతేకాక పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నట్లుగా తమకు తెలిసిందని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో పోలీసులు సమర్పించిన రిమాండ్ నివేదికలో నవదీప్ మాదకద్రవ్యాల వాడకందారుగా మాత్రమే తప్పించి.. సరఫరాదారుగా పేర్కొనలేదన్న విషయాన్ని ప్రస్తావించారు.
మాదకద్రవ్యాలను వాడే వారిని చట్టంలో బాధితుడి కింద చూస్తారని.. చట్టంలో రక్షణ ఉందని.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ ఉదంతంలో నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం.. నిందితుడితో ఉన్న ఒక మెసేజ్ ఆధారంగా కేసులో తన క్లయింట్ ను ఇరికించారన్నారు. దీనికి పీపీ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ వాడకందారో.. సరఫరా దారో పోలీసు విచారణలో తెలుస్తుందన్నారు. ఇరుపక్షాల వాదనల్ని విన్న న్యాయమూర్తి ఈ కేసులో పోలీసులు సీఆర్ పీసీ 41ఏను ఫాలో కావాలని.. నవదీప్ పై కఠిన చర్యలు వద్దంటూ ఉత్తర్వులు జారీ చేశారు.