సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి, దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్రువర్ గా మారిన దస్తగిరి రెండోసారి ఇచ్చిన వాంగ్మూలం పెను దుమారం రేపుతోంది. తాజాగా దస్తగిరి వాంగ్మూలంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరును ప్రస్తావించారన్న ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బృందంలోని ఏఎస్పీ రాంసింగ్‌పై అవినాష్ రెడ్డి సన్నిహితుడుగా ప్రచారం జరుగుతున్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని తనను రాంసింగ్ బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలతో రాంసింగ్‌పై కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది.
అయితే, తనపై కేసు నమోదు చేయడాన్ని రాంసింగ్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలోనే నేడు రాంసింగ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులకు హైకోర్టు షాకిచ్చింది. రాంసింగ్ పై కేసు విచారణలో తదుపరి చర్యలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, ఈ కేసులో తదుపరి చర్యలేమీ తీసుకోవద్దంటూ కడప జిల్లా పోలీసులకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో, వివేకా కేసులో జగన్ కు హైకోర్టు షాకిచ్చినట్లయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
కేసు విచారణను ప్రభావితం చేసేలా రాంసింగ్ పై కేసు పెట్టించారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వివేకా కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలని వైఎస్ సునీతా రెడ్డి కోరుతున్నప్పటికీ…ఇలా విచారణను ప్రభావితం చేసేలా ప్రవర్తించడంపై కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి వ్యవహారాలను సునీతా రెడ్డి ముందుగానే ఊహించి ఢిల్లీ వీధుల్లో తన అన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారని విమర్శిస్తున్నారు.