వివేకా మర్డర్ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంపై నేడు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ సునీత తరఫు లాయర్ల వాదనలు నిన్న విన్న తెలంగాణ హైకోర్టు…ఈ రోజు సీబీఐ తరఫు లాయర్ల వాదనలు పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ బెయిల్ పిటిషన్ పై సంచలన తీర్పునిచ్చింది.
వచ్చే బుధవారం వరకు అవినాష్ ను అరెస్ట్ చేయవద్దంటూ సీబీఐని హైకోర్టు ఆదేశించింది. మే 31 ఈ వ్యవహారంలో తుది ఉత్తర్వులిస్తామని పేర్కొంది. అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యం నేపథ్యంలో ఈ ప్రకారం ఆదేశాలను జారీ చేసింది. మే31 వరకు అవినాష్ రెడ్డిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినాష్ రెడ్డిపై ఏ ఆధారాలతో అభిమోగాలు మోపుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది.
సాక్షుల వాంగ్మూలాల మేరకు అభియోగాలు మోపామని కోర్టుకు సీబీఐ తెలిపింది. సీల్డ్ కవర్ లో సాక్షుల వాంగ్మూలాలను సమర్పిస్తామని చెప్పగా…అందుకు హైకోర్టు అంగీకరించింది. తాజాగా హైకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డికి మరి కొద్ది రోజుల పాటు ఊరట లభించినట్లయింది. నిన్న సీబీఐ కోర్టులో సమర్పించిన అఫిడవిట్ లో జగన్ ప్రస్తావన రావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. జగన్ కు వివేకా హత్య గురించి ఉదయం 6 గంటలకే తెలుసని పేర్కొనడం చర్చనీయాంశమైంది.