ఏపీలోని అన్ని జిల్లాల్లోకీ గుంటూరుకు ప్రత్యేకత ఉంది. ఇది రాజధాని జిల్లాగా పేరు తెచ్చుకుంది. టీడీపీ అయితే.. భారీ ఎత్తున ఆశలు పెట్టుకుంది. అయితే.. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కింది. ముఖ్యంగా నలుగురు రెడ్లు ఇక్కడ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు ఏడాదిన్నర దాటిపోయింది. మరి ఈసమయంలో వారి కెరీర్ ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? రెడ్డి రాజ్యం ఏర్పడాలని కలలుగన్న వీరికి జగన్ రెడ్డి పాలనలో లభించిన ఆదరువు ఎంత? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు ఆసక్తిగా మారాయి. అయితే.. ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే ఎవరిదారి వారిది.. ఎవరి వ్యూహాలు వారివి! అంతకు మించి వీరికి పెద్దగా ప్రాధాన్యం లేదు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి: మంగళగిరి నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు. తొలిసారి కేవలం పాతిక ఓట్లతో విజయం సాధించిన ఆయన రెండో దఫా మట్టికరుస్తారనిఅందరూ అనుకున్నారు. ఎందుకంటే.. టీడీపీ నెంబర్ 2 నాయకుడు, చంద్రబాబు తనయుడులోకేష్.. పోటీ చేశారు. దీంతో ఆళ్ల కూడా గెలుపుపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అయితే.. జగన్ ఇక్కడ ప్రజాసంకల్ప పాదయాత్రకు వచ్చినప్పుడు.. ఆళ్లకు మంత్రి పదవి ఇస్తానన్నారు.. ఇది వైసీపీ కేడర్‌లో ఆశలు రేకెత్తించింది. అయితే.. ఇన్నాళ్లయినా.. ఈ పదవి దక్కలేదు. పోనీ.. ఆయనైనా దూకుడుగా ఉన్నారా? లేదు. సీఆర్ డీయే చైర్మన్‌గిరీ లభించినా.. పనిలేక పోవడంతో వ్యవసాయం చేసుకుంటున్నారు.
కాసు మహేష్‌రెడ్డి: పల్నాడులోని గురజాల నియోజకవర్గంలో తొలిసారి వైసీపీ జెండా ఎగరేశారు. ఈయనకు కూడా ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఇక, ఈయనపై మట్టి, ఇసుక దందాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లను సైతం పక్కన పెట్టి చక్రం తిప్పుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి కన్నా.. రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారట.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి: మాచర్ల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగోసారి విజయం దక్కించుకున్నారు. మంచి కేడర్ కూడా ఉంది. అయినా. కూడా ఆశించిన పదవి దక్కలేదు. కేవలం విప్‌తో సరిపెట్టారు. దీంతో తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. ఇంత సీనియర్‌ను కాదని.. ఎవరికి పదవి ఇస్తారంటూ.. ? ఆయన ఎన్నికల తర్వాత పరోక్షంగా ప్రచారం చేయించుకున్నారు. అయినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈయన కూడా సైలంట్ అయిపోయారు.
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి: టీడీపీ కి బలమైన నరసారావు పేట నియోజకవర్గంలో వరుస విజయాలు సాధిస్తున్నారు. డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. అయితే.. రాజకీయంగా ఎంత దూకుడు చూపించినా.. ఈయన కూడా ప్రాధాన్యం లేని జాబితాలోనే ఉన్నారు. పైగా రెడ్డి ప్రభుత్వం ఏర్పడాలని కోరుకున్న నాయకుల్లో ఈయన ప్రధానం గా ఉన్నారు. జగన్‌కు మద్దతుగా పాదయాత్ర కూడా చేశారు. అయినా.. గుర్తింపు లేదు. వస్తుందన్న నమ్మకం కూడా లేదు. సో.. ఈ నలుగురు రెడ్లు జిల్లాలో కీలక పాత్ర పోషిస్తారని భావించిన నాయకులకు నిరాశే ఎదురవుతోందని వైసీపీ భారీ ఎత్తున వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపుపై తర్జన భర్జన పడుతుండడం గమనార్హం.