ఏపీ డిప్యూటీ సీఎం, గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే.. కిలత్తూరు నారాయణ స్వామి.. రెడ్డి సామాజిక వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటీశ్వరులైన రెడ్లు.. ఎస్సీ సామాజిక వర్గానికిచెందిన నన్ను తిడుతున్నారని ఆయన చెప్పారు. ఇలా.. ఇతర కులాల వారు ఎవరూ తనను విమర్శించడం లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు రెడ్డి సామాజిక వర్గంలో మంటలు రేపుతున్నాయి. ఏపీలో ఉన్నదే రెడ్డి ప్రభుత్వం కావడం.. అందునా.. రెండోసారి ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం.. ఇప్పుడు ఆయన ఇలా వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.
ఏం జరిగింది?
“కోటీశ్వరులైన రెడ్లే నన్ను తిడుతున్నారు. నేను ఎస్సీనని తెలిసి చులకనగా చూస్తున్నారు. ఇంక ఇతర కులాల వాళ్లెవరూ ఇలా.. తిట్టడంలేదు. ఇంకెవరూ నన్ను అసలు వ్యతిరేకించడం లేదు. నా సహకారంతో పదవులు, లబ్ధి పొందిన వారే నన్ను విమర్శిస్తున్నారు’` అని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా పెనుమూరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో చేనేత కార్మికులకు మగ్గాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన కామెంట్లు చేయడం గమనార్హం.
‘కొందరు నాయకులు నా ద్వారా పదవులు పొంది నన్నే విమర్శించడం మంచిది కాదు. నేను ఎన్నికల్లో రెడ్ల వల్లనే గెలుపొందా నని ఆ వర్గంలోని కొందరు పెత్తందార్లు నాపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. నాకు కూడా ఓటు బ్యాంకు ఉంది. నాకు కూడా సత్తా ఉంది’ అని పరోక్షంగా ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారు, మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఆయన ఆరోపణలు చేశారు.
‘నాతో లబ్ధి పొందనివాడు ఎవరైనా ఉంటే రమ్మనండి.. నా సహాయం పొందని వారుంటే నా ముందుకు రమ్మనండి.. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిలో మంత్రికీ, ఎమ్మెల్యేకు సంబంధం లేదట.. ఎందుకు ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. నేను పదవి కంటే ఆత్మాభిమానంతో బతుకుతా. ఎవడికయ్యా నేను అన్యాయం చేసింది..? ఉపముఖ్యమంత్రిని కాబట్టి తల వంచుకుపోతున్నా.. నేను ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే నేరుగా వచ్చి మాట్లాడమనండి.. ఈ మండలంలో ఎవరూ బానిసలుగా బతకరాదనేది నా ఉద్దేశం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.