కేసీఆర్ కూ, రెడ్ల కూ చెడిందా? ఇదే ప్రశ్న సోషల్ మీడియాలో వస్తోంది. లేదా కేవలం ఓ వర్గం కారణంగానే ప్రజాగ్రహం నిన్నటి వేళ మల్లారెడ్డిపై ప్రకటితం అయిందా ? ఇదే ప్రశ్న సోషల్ మీడియాలో మరో చర్చకు తావిస్తోంది. వాస్తవానికి ఇక్కడ ప్రజాగ్రహం ఎక్కువగా ఉందని, వచ్చే ఎన్నికల నాటికి దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని కొంత మేరకు టీఆర్ఎస్ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఎదురీత తప్పదని అంటోంది ఓ వర్గం.
విపక్ష పార్టీలన్నీ ఏకమై కేసీఆర్ పై చేసే తిరుగుబాటు మంచి ఫలితాలు ఇవ్వవచ్చు అని కూడా అంటోంది. అయితే ఇప్పటికిప్పుడు వివిధ పార్టీల కూడిక అన్నది తేలకపోయినా, రేపటి వేళ తెలంగాణలో ప్రజా వ్యతిరేకతను అర్థం చేసుకోకుండా సీఎం కేసీఆర్ ఏక పక్ష నిర్ణయాలు వెలువరిస్తే ఇప్పటి కన్నా దారుణంగా అక్కడి స్థితిగతులు మారిపోయేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యాన రెడ్ల కోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్ ఇప్పుడు ఊపందుకుంది. ఇదే నిన్నటి వేళ ఘట్ కేసర్ లో జరిగిన రెడ్ల సింహ గర్జన నిర్వహణకు ప్రధాన కారణమైంది.
అదేవిధంగా రెడ్ల సంక్షేమం కోసం ప్రభుత్వాలు మరింత పనిచేయాల్సి ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. దీనిపైనే అంతా దృష్టి సారించాలని పాలక వర్గాన్ని కోరుతున్నారు సంబంధిత కుల నాయకులు. అయితే మల్లారెడ్డి స్పీచ్ మాత్రం పూర్తిగా కేసీఆర్ కు అనుగుణంగా ఉందని, పొలిటికల్ స్పీచ్ లు తమకు కావాల్సింది కాదని, ఆచరణ ముఖ్యమని కొందరు అంటున్నారు. ఇదే ఇప్పుడు చర్చకు తావిస్తోంది. ప్రజాగ్రహం ఈ స్థాయిలో ఉంటే వచ్చే ఎన్నికల్లో ఫలితాలు అన్నీ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటాయన్న వాదన ఒకటి వినిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఎంటర్ అయినప్పటి నుంచి కొన్ని పరిణామాలు మారిపోయాయి. ఎప్పటి నుంచో పార్టీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకుగా ఉన్న రెడ్డి కులస్తులంతా ఒక్కటి చేరి, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేందుకు ఇష్టపడుతున్నారు అని వార్తలొస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా రేవంత్ క్రేజ్ బాగుంది. పనితీరు దృష్ట్యా పార్టీ పరంగా అవరోధాలు ఉన్నా వాటిని సైతం అధిగమించేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఆశించిన స్థానాలు దక్కించే క్రమంలో రేవంత్ కృషి సఫలీకృతం అయితే ఇతర పార్టీలలో ఉన్న రెడ్లు కూడా పునరాలోచనలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు నిన్నటి సభ చాలా విషయాలు చర్చించేందుకు తావిచ్చింది. ముఖ్యంగా పాలక పక్షాలు ప్రధాన డిమాండ్ ను పట్టించుకోవడం లేదన్న కోపం వారిలో విపరీతంగా ఉందని తెలుస్తోంది. అందుకే రెడ్ల గర్జన నిన్నటి వేళ అనేక ఉద్రిక్తతలకు కారణం అయి ఉండవచ్చు.