హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ రికార్డు సృష్టించడం ఖాయమేనా? ఆయన గతానికి ఇప్పటికి సంచలనాలు సృష్టించే దిశగా దూసుకు పోతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నాయకులు. వరుస విజయాలు దక్కించుకున్న బాలయ్య.. ఇప్పుడు గతానికి భిన్నంగానే నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. దీనికి కారణం.. అధికార పార్టీ వైసీపీ.. వ్యూహాత్మకంగా ఇక్కడ అడుగులు వేస్తుండడమే.
ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించాలన్న లక్ష్యంతో కుప్పం నియోజకవర్గంపై కన్నేసిన వైసీపీ ఇక్కడ పలు కార్యక్రమాలు చేసింది. ఈ బాధ్యతలను వైసీపీ షార్ప్ షూటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భుజాలపై వేసుకున్నారు. చంద్రబాబును ఓడించేందుకు ఆయన అహరహం శ్రమిస్తున్నారు. ఈ పరంపరలో ఇప్పుడు హిందూపురం కూడా వీరి ఖాతాలో చేరింది. ఇక్కడ బాలయ్యను నిలువరించడం ద్వారా.. వైసీపీకి తిరుగులేదన్న సంకేతాలు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన బాలయ్య.. నియోజకవర్గంపై నిశితంగా దృష్టి పెట్టారు. గతంలో ఇక్కడ ఆయన పెద్దగా అందుబాటులో ఉండేవారు కాదన్న విమర్శలను పక్కన పెడుతూ… ఎంతో బిజీగా ఉన్న సమయంలోనూ.. సినిమా షూటింగులతో తీరిక లేనప్పుడు కూడా ఖాళీ చేసుకుని మరీ సొంత నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారు.ఆ యన సతీమణి వసుంధర.. కూడా ఇక్కడే పాగా వేస్తున్నారు. నెలలో నాలుగు రోజులు వచ్చి వెళ్తున్నారు.
అందరినీ పలకరిస్తున్నారు. వైద్యం, ఆహారం.. వంటి కీలక అంశాలను ఆమే పర్యవేక్షిస్తున్నారు. స్థానిక సంస్కృతి , సంప్రదాయాలకు సైతం పెద్దపీట వేస్తున్నారు. ఇటీవల ఇక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అందరికీ అన్నదానం, వస్త్రదానం చేశారు. అదేవిధంగా సంక్రాతి పండుగను ఘనంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. ఏకార్యక్రమానికి ఎవరు పిలిచినా.. మేమున్నామంటూ హాజరువుతున్నారు. మొత్తానికి బాలయ్య మార్చిన వ్యూహంతో ఆయన గెలుపు మరోసారి పక్కా అనే మాట వినిపిస్తుండడం గమనార్హం.