గుంటూరు నగరం నడిబొడ్డులో బీబెక్ విద్యార్థిని రమ్య హత్యోదంతం ఏపీలో రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. దిశ చట్టం అంటూ జగన్ హడావిడి చేసినా…రమ్య వంటి అమ్మాయిలు బలవుతున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తోపాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు కేసులు పెట్టడం, అరెస్టు చేయడంపై విమర్శళు వెల్లువెత్తుతుతన్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా రమ్య మర్డర్, టీడీపీ నేతల అరెస్టు వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదని, ఓదార్పు కార్యక్రమం జగన్ సొంత హక్కుగా భావించారా? అని ప్రశ్నించారు. వేరే ఎవరికీ ఓదార్పు చేసే హక్కు లేదా? అని జగన్ ను నిలదీశారు. సీఎం ఓదారిస్తే శాంతి భద్రతలుంటాయని, వేరే వారు ఓదారిస్తే శాంతి భద్రతలు ఉండవా? అని రఘురామ సూటిగా ప్రశ్నించారు.
జగన్ ఓదార్పు యాత్రకు చంద్రబాబు హక్కు కల్పించారన్న విషయాన్ని రఘురామ గుర్తు చేశారు. రమ్య హత్య ఘటన తనను బాధించిందని, దిశ చట్టం అమలు కావడం లేదని, ఆ చట్టాల పేరుతో జనాలను మోసం చేయొద్దని రఘురామ హితవు పలికారు. మంత్రి నక్కా ఆనంద్ బాబుపై ఎస్పీ చేయి చేసుకున్నట్లు తెలిసిందని, అది మంచిది కాదని, పోలీసులను జగన్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రమ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించాలని, జగన్ ఇంటి నుంచి బయటకు రారని, వచ్చిన వారిని అరెస్ట్ చేస్తారని రఘురామ ఎద్దేవా చేశారు.
ఇక, ఏ-2 విజయసాయిరెడ్డి బెయిల్పై కౌంటర్ వేశారని, ఏ-1, ఏ-2లపై ఇవాళ మరో రెండు చార్జి షీట్లను ఈడీ దాఖలు చేసిందని రఘురామ వెల్లడించారు. జనాల ఇబ్బందులను జగన్ దృష్జికి తీసుకువస్తున్నానని, ప్రచారం కోసం ఇలా చేయడం లేదని అన్నారు. బ్లాంక్ జీవోలు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని, జీవోలను అందరికీ అందుబాటులో ఉంచాలని, జగన్ కు పారదర్శకత లేదా అని నిలదీశారు.