ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. కొద్ది నెలల క్రితం మహారాష్ట్రతోపాటు తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నప్పటికీ మనకేం కాదులే అన్న రీతిలో ఏపీ సీఎం జగన్ వ్యవహరించడం వల్లే ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో 25 శాతానికి చేరుకుందన్న విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు వ్యాక్సిన్ల కొనుగోలులో జగన్ నిర్లక్యం వంటి వ్యవహారాలతో ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. కర్ణుడి చావుకు 100 కారణాలన్న రీతిలో…ఏపీలో కరోనా విజృంభించడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
కరోనా ఫస్ట్ వేవ్ కు తీసుకున్నన్ని జాగ్రత్తలు సెకండ్ వేవ్ లో ఏపీ ప్రభుత్వం తీసుకోలేదు. రాష్ట్రాలు స్వయంగా కంటైన్ మెంట్ జోన్లను గుర్తించి అక్కడ కఠినంగా లాక్ డౌన్ విధించాలని కేంద్రం చెప్పి చేతులు దులుపుకుంది. దీంతో, ఏపీ సర్కార్ కూడా సెకండ్ వేవ్ ను లైట్ తీసుకోవడంతో కంటైన్మెంట్ జోన్లు మచ్చుకు కూడా కనబడడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కరోనా తీవ్రతను గుర్తించేందుకు ర్యాండమ్ గా వివిధ ప్రాంతాల్లో కరోనా టెస్టులు చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం టెస్టుల కోసం ఆస్పత్రులకు వచ్చినవారు టెస్టుల కోసం క్యూలో నిలబడడం, కొన్నిసార్లు వేచి ఉన్నప్పటికీ చాలా చోట్ల టెస్టు కిట్లు లేవన్న సమాధానం వినిపిస్తోంది. ఇక, కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాల్లోనూ భౌతిక దూరం కనిపించడం లేదు.
కాబట్టి, టెస్టింగ్, వ్యాక్సినేషన్ ప్రక్రియలోనే చాలామంది కరోనా బారిన పడే అవకాశముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వ్యాక్సినేషన్ కోసం టోకెన్ విధానం పెట్టినా అది సరిగ్గా అమలు కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వలంటీర్లు, ఏఎన్ఎంల వ్యవస్థను ఉపయోగించుకొని 50 ఇళ్ల పరిధిలో ఇంటింటికీ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపడితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా ఫస్ట్ వేవ్ నేర్పిన పాఠాలతో సెకండ్ వేవ్ వచ్చేనాటికి ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సిబ్బందిని పెంచాల్సి ఉన్నప్పటికీ…అరకొర నియామకాలు చేపట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కరోనా బారిన పడి వైద్య సిబ్బందిలో కొందరు మృత్యువాత పడడం, కొత్త నియామకాలు తగినన్ని చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఉన్న వైద్యులు, వైద్య సిబ్బందిపై పనిభారం ఎక్కువ అయిందన్న విమర్శలు వస్తున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ మొదలైన 2 నెలల తర్వాత ఏపీలో ఫివర్ సర్వే చేశారు. ఈ సర్వే ఇంకా ముందు చేసుంటే కేసుల తీవ్రత తగ్గి ఉండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత ఓ వైపు వేధిస్తుంటే..మరోవైపు కొన్ని చోట్ల పర్యవేక్షణ లేక ఆక్సిజన్ వృథా అవుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
చాలా చోట్ల ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగటివ్ వచ్చినా ఆర్టీ పీసీఆర్ చేయడం లేదు. ర్యాపిడ్ టెస్టులో నెగటివ్ వచ్చి స్వల్ప లక్షణాలున్నా, అసింప్టమేటిక్ అయినా వారంతా బయట తిరగడంతో కేసులు పెరుగుతున్నాయి. ర్యాపిడ్ ను ప్రామాణికంగా తీసుకోకుండా ఆ కిట్లకు అయ్యే ఖర్చుతో మరిన్ని ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఇపుడున్న కరోనా వేరియంట్ కొన్ని సార్లు ఆర్టీపీసీఆర్ టెస్టులో కూడా బయటపడడం లేదు. అటువంటి వారికి చెస్ట్, సీటీ స్కాన్ చేయించాలి. ఫస్ట్ వేవ్ లో 45 ఏళ్లలోపు వారికి ప్రమాదం లేదని చెప్పడంతో సెకండ్ వేవ్ లో వారే ఎక్కువగా కరోనాకు బలయ్యారు. ఈ విషయాలపై ప్రజలకు ప్రభుత్వం మరింత అవగాహన కల్పించాలి.
క్వారంటైన్ సెంటర్లు, కోవిడ్ కేర్ సెంటర్లు, ఆస్పత్రులలో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ల లభ్యత పై మరింత ప్రచారం కల్పించాలి. మాస్కులు, భౌతిక దూరం, శానిటైజర్ వాడకంపై మరింత విస్తృతంగా ప్రచారం కల్పించి ప్రజల్లో అవగాహన పెంచాలి. హోమ్ క్వారంటైన్, మందుల వాడకం, డాక్లర్ల అవసరం ఎప్పుడు పడుతుందన్న విషయాలపై సినీ ప్రముఖులతో ప్రభుత్వం ప్రచారం చేయించాలి.
కరోనా వేళ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ వేయించుకోకుండానే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు విధులు నిర్వహించి కరోనా బారిన పడ్డారు. వారిలో చాలామంది టీచర్లు, ప్రభుత్వుద్యోగులు కరోనాతో పోరాడి మరణించారు. వారిని ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, డెలివరీ బాయ్స్
కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషించాల్సిన కలెక్టర్లు, రెవెన్యూ ఉద్యోగులు…సంక్షేమ పథకాల అమలు వంటి వ్యవహారాలపై ఫోకస్ చేయాల్సి వస్తోంది. ఈ మహమ్మారి తగ్గేవరకు సంక్షేమ పథకాలను తాత్కాలికంగా నిలిపివేస్తే వారిపై పనిభారం తగ్గి కరోనా కట్టడిపై పోకస్ చేసే అవకాశముంది. ఇక, కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కల్పించే కాలర్ ట్యూన్ ను భాషా ప్రాతిపదికన ప్రచారం కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
కరోనా కాలంలోనూ కక్షసాధింపు రాజకీయాలపై ప్రభుత్వం ఫోకస్ చేయడం మానేసి కరోనా కట్టడిపై ఫోెకస్ చేయాలి. ప్రభుత్వం విధానాలను, తప్పులను ఎత్తిచూపే ఎంపీ రఘురామ వంటివారిపై కక్ష సాధించడం వంటివి ఆపాలి. ఆఖరికి కరోనాకు ఆయుర్వేదం మందు కనిపెట్టిన ఆనందయ్య మందును కూడా వైసీపీ నేతలు స్వలాభం కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వం కరోనా కట్టడిపై మరింత శ్రద్ధ పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.