ఏళ్లు ఏళ్లుగా నిర్మాణం సా..గుతున్న పోలవరం ప్రాజెక్టుకు ఆలస్యానికి కారణం ఏమిటి? దీనికి బాధ్యులు ఎవరు? అన్న సూటిప్రశ్నల్ని కేంద్రాన్ని సంధించాడో వ్యక్తి. సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా చేసుకొని అడిగిన ఈ ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తాజాగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఇంతకూ ఆ ప్రశ్నను సంధించిన వ్యక్తి ఎవరంటే.. చైతన్యకుమార్ రెడ్డి. ఆన్ లైన్ లో అడిగిన ప్రశ్నలకు కేంద్రం రియాక్టు అయ్యింది. ఆలస్యానికి కారణాలు వెల్లడించింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యంలో తప్పంతా రాష్ట్రానిదేనని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తరఫున పోలవరం ప్రాజెక్టు అథారిటీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న పీడీ రావు బదులిచ్చారు. ఆయనేం చెప్పారన్న అంశాల్ని చూస్తే..
– పోలవరం నిర్మాణంలోని జాప్యానికి.. వ్యయం పెరగటానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ విధానాలే. 2019-2023 వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.7654.23 కోట్లను రీయింబర్స్ మెంట్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థను మార్చేసింది.
– భూసేకరణ.. సహాయ పునరావాస కార్యక్రమాల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ప్రస్తుత నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్.. ప్రణాళిక.. వ్యూహాత్మక కార్యాచరణలో తీవ్రంగా వైఫల్యం చెందుతోంది.
– ప్రాజెక్టు నరి్మాణ డిజైన్లను సమర్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన జాప్యం చేస్తోంది. ఆమోదం పొందిన డీపీఆర్ లోని డిజైన్లలోనూ మార్పులు చేర్పులు చేశారు.
– రివైజ్డ్ షెడ్యూల్ కమిటీ నివేదిక మేరకు ఏప్రిల్ 2022 నాటికి పోలవరం పనులు పూర్తి కావాలి. 2024 మార్చి నాటికి పూర్తయ్యే వీలుంది.
– పోలవరం ముంపు ప్రాంతం 1.57లక్షల ఎకరాల్లో 1.13 లక్షల ఎకరాలే సేకరించారు. ఈ ఏడాది చివరకు మిగిలిన భూమిని సేకరించాల్సి ఉంది. 1.06 లక్షల నిర్వాసిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంది.
– మొత్తం కుటుంబాల్లో కేవలం 11 శాతం మేర మాత్రమే తరలించారు. మరో 89 శాతం అంటే 94,329 కుటుంబాల్ని ఈ డిసెంబరు నాటికి తరలించాల్సి ఉంది.