సమర్థుడైన అధికారిగా గుర్తింపు. కెరీర్ లో పెద్దగా మరకలు లేని వైనం. పని అప్పగిస్తూ.. ఎలాంటి తప్పు దొర్లకుండా పూర్తి చేస్తారన్న పేరు. ఇన్ని ఉన్న అధికారిని రాష్ట్ర పోలీస్ బాస్ గా ఎంపిక చేస్తే.. ఎలా ఉంటుంది? కచ్చితంగా బాగుంటుంది. మిగిలిన అధికారులకు స్ఫూర్తిని ఇచ్చేలా.. ఒక రాష్ట్ర డీజీపీ ఎలా ఉండాలన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా వ్యవహరిస్తారని అనుకుంటాం. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. ఒక డీజీపీ అన్న అధికారి ఎలా ఉండకూడదో చూడాలనుకుంటే..ఆయన పని తీరు చూస్తే ఇట్టే అర్థమైపోతుందన్న చెడ్డపేరును మూటగట్టుకోవటంలో ఏపీ డీజీపీగా వ్యవహరించిన గౌతమ్ సవాంగ్ సక్సెస్ అయ్యారు. ఇంతా చేసి.. పదవీ కాలం పూర్తి కాక ముందే అనూహ్యంగా బదిలీ వేటు పడటమే కాదు.. ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్టు చేయాలని పేర్కొనటం చూస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేం.
తాజాగా గౌతమ్ సవాంగ్ కు ఎదురైన పరిస్థితిని చూసిన తర్వాత.. టీడీపీ తమ్ముళ్లు సైతం సంతోషించటమే కాదు.. ఆయనపై రివెంజ్ తీర్చుకోవాలనుకున్న వారి ఆవేశమంతా చల్లారే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ.. గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు ఎందుకు పడింది? ఆయన విషయంలో ఏపీ ప్రభుత్వం ఇలా ఎందుకు వ్యవహరించిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వివిధ మీడియా సంస్థలకు చెందిన వెబ్.. చానళ్లను చూసినప్పుడు ఒక అంశాన్నే అందరూ హైలెట్ చేయటం కనిపిస్తుంది.
ఉద్యోగ సంఘాలు నిర్వహించిన బెజవాడ ర్యాలీ విషయంలో డీజీపీ ఫెయిల్ అయ్యారని.. అందుకే ఆయనకు బదిలీ వేటు బహుమానంగా ముఖ్యమంత్రి ఇచ్చారని చెబుతున్నారు. నిజంగానే ఉద్యోగ సంఘాల ర్యాలీ విషయంలో జగన్ ప్రభుత్వం గుర్రుగా ఉంటే.. ఇంతకాలం వెయిట్ చేసేదా? అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోవటానికి చంద్రబాబు మాదిరి జగన్ తటపటాయిస్తారా? ఛాన్సే లేదు. ఆయన నిర్ణయం తీసుకోవాలని ఒకసారి డిసైడ్ అయితే.. వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తారు. నిజంగానే ఉద్యోగ సంఘాల ర్యాలీ కారణంగా గౌతమ్ సవాంగ్ మీద వేటు పడి ఉంటే.. ఆయనతో పాటు నిఘా విభాగం చీఫ్ మీద కూడా వేటు పడాలి కదా? నిజానికి.. ఈ ఇష్యూలో అడ్డంగా ఫెయిల్ అయ్యింది రాష్ట్ర ఇంటెలిజెన్సే కదా? అయితే.. ఇంటెలిజెన్స్ చీఫ్ కు ప్రమోషన్ ఇస్తూ ఆయన్ను రాష్ట్ర డీజీపీగా ఎంపిక చేయటం చూసినప్పుడు ఉద్యోగ సంఘాల ర్యాలీ బదిలీ వేటుకు కారణం కాదన్న అభిప్రాయం కలుగక మానదు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అత్యున్నత అధికారుల మాటల్లో వినిపిస్తున్న మరోకారణం గౌతమ్ సవాంగ్ మీద చర్యలకు కారణమైందని చెబుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చార్జిషీటులోని అంశాలు అధికార పార్టీని.. ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురి చేసేలా ఉన్నాయని.. ఆ విషయానికి సంబంధించిన ఫీడ్ బ్యాక్ ను సరైన సమయంలో సరైన రీతిలో అందించే విషయంలో దొర్లిన తప్పులకే మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్న మాట వినిపిస్తోంది. ఉద్యోగుల ర్యాలీ అంశం దానికి అదనంగా చేరిందే తప్పించి.. ఆ ఒక్క కారణంతోనే తాజా పరిణామం చోటు చేసుకోలేదన్న మాట వినిపిస్తోంది. ఇందులో వాస్తవం ఎంతన్నది రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు స్పష్టం చేస్తాయని చెప్పక తప్పదు.