వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు నరసాపురం ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ సంగతి తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరఫున తాను నరసాపురం లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతారని స్వయంగా రఘురామే చెప్పారు. బీజేపీ తరఫున టికెట్ దక్కుతుందని రఘురామ విశ్వాసంతో ఉన్నారు. అయితే, ఏ పార్టీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో, జగన్ లాబీయింగ్ వల్లే తనకు టికెట్ దక్కలేదని, తన తాత్కాలిక ఓటమిని అంగీకరిస్తున్నానని అన్నారు. దీంతో, రఘురామకు టికెట్ దక్కకుండా చేసింది ఎవరు అన్న చర్చ జోరుగా జరుగుతోంది.
నరసాపురం ఎంపీ టికెట్ రఘురామకు బీజేపీ తరఫున కేటాయిస్తే ఏపీ బీజేపీ ఆయన చేతిలోకి వెళ్ళిపోతుందన్న కారణంతోనే ఆయనకు బీజేపీ పెద్దలు టికెట్ నిరాకరించారు అన్న వాదన బలంగా వినిపిస్తోంది. రఘురామకు నరసాపురం ఎంపీ టికెట్ ఇప్పించేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేసినా బీజేపీ అగ్ర నేతలు, ఏపీ బీజేపీ నేతలు…రఘురామకు టికెట్ దక్కుండా చేశారని టాక్. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో లాబీయింగ్ చేయగల సమర్ధుడైన రఘురామ వంటి నేత ప్రస్తుతం ఏపీ బీజేపీకి లేరనే చెప్పాలి.
బీజేపీ తరఫున రఘురామ నరసాపురం లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచి గెలిస్తే ఆ తర్వాత ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడం కష్టమేమీ కాదు. అదే జరిగితే చాలాకాలంగా ఏపీ బీజేపీని నమ్ముకున్న తమ పరిస్థితి ఏంటి అని ఏపీ బీజేపీ నేతలు అంతర్మథనంలో పడ్డారట. అందుకే ఆర్ఆర్ఆర్ కు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వకుండా వారు అడ్డుకున్నారని తెలుస్తోంది.