ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం నేపథ్యంలో నాటి ఉమ్మడి ఏపీ సీఎం, దివంతగ నేత వైఎస్సార్ పై తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు నోటికి వచ్చినట్టు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. వైఎస్ నరరూప రాక్షసుడని…వైఎస్ తెలంగాణ ద్రోహి అని తెలంగాణ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నా….సీఎం జగన్, వైసీపీ నేతలు నోరు మెదపడం లేదు. కనీసం…వారి విమర్శలను తిప్పి కొట్టకపోగా వారిని పల్లెత్తు మాటనడం లేదు.
అయితే, తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా..తన తండ్రిని దూషిస్తున్నా…జగన్ మౌనమునిలా ఎందుకున్నారని చాలామంది వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. కనీసం, కొడాలి నాని వంటి వారిని ఆదేశించినా…టీ మంత్రులపై బూతులతో విరుచుకుపడేవారు కదా అని చెవులు కొరుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలతో పాటు ఏపీ ప్రజల ధర్మ సందేహాలను పటాపంచలు చేశారు సీఎం జగన్.
తాను తెలంగాణ మంత్రులను పల్లెత్తు మాట అనకపోవడానికి కారణమేమిటో చెప్పేశారు ఏపీ సీఎం. తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని తాజాగా ముగిసిన కేబినెట్ భేటీలో జగన్ అన్నారు. తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని, తాను మంత్రులను ఏమైనా అంటే…. వాళ్లను ఇబ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడటం లేదంటూ జగన్ క్లారిటీ ఇచ్చేశారు. కానీ, రైతులకు అన్యాయం జరుగుతుంటే తాను ఊరుకోబోనని, సాగు నీటి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు జగన్ సూచించారు.
ఈ నేపథ్యంలోనే జగన్ పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ తో జగన్ లాలూచి పడ్డారని, అందుకే కన్నతండ్రిపై విమర్శలు గుప్పిస్తున్నా గమ్మునున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణలో ఏపీ ప్రజలు చాలా ఏళ్లుగా ఉంటున్నారని, ఇకపై కూడా చాలా ఏళ్లు ఉంటారని….అంతమాత్రాన ఏపీకి నీటి ప్రాజెక్టులు వచ్చే విషయంలో కేసీఆర్ ను, మంత్రులను విమర్శించబోనని జగన్ అనడం హాస్యాస్పదం అని అంటున్నారు.