సీఎం జగన్ కు తాడేపల్లి ప్యాలెస్ అంటే చాలా మక్కువని, ఆయన ప్యాలెస్ వదిలి బయటకు రావడానికి అస్సలు ఇష్టపడరని విపక్ష నేతలు విమర్శిస్తుంటారు. కరోనా టైంలో జగన్ కన్నా ఎక్కువ వయసున్న సీఎంలు కూడా మాస్కులు, శానిటైజర్లు పెట్టుకొని జనాల్లో తిరిగారు. కానీ, జగన్ మాత్రం… నాకెందుకు వచ్చిన గోల అనుకొని తాడేపల్లి ప్యాలెస్ వదిలి అడుగు బయటపెట్టడం లేదని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఓ రేంజ్ లో జరిగింది.
ఇక, సీఎం హోదాలో ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ఎగురవేయక తప్పదు కాబట్టి…జగన్ తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చారని గతంలో విమర్శలు వచ్చాయి. మొన్నటికి మొన్న వరదలు వచ్చి జనం అతలాకుతలమైనా సరే…హెలికాప్టర్లో చక్కర్లు కొట్టి వెళ్లిపోయారని విమర్శలు రావడంతో …ఏదో మొక్కుబడిగా…కిలోమీటరు దూరం నిలబడి జనాలకు హాయ్ చెప్పి వెళ్లిపోయారని టాక్ వచ్చింది.
అయితే, జగన్ తాడేపల్లి వదిలి రావడం లేదని ట్రోలింగ్ జరిగినా… జగన్ మర్యాద రామన్న సినిమాలో సునీల్ లా ప్యాలెస్ వదిలి బయటకు ఎందుకు రారో తెలిస్తే…ఆ విమర్శలు చేసేవాళ్లంతా జేబులో చేతులు పెట్టుకొని ఆకాశం వైపు చూస్తూ ఎటో వెళ్లిపోవాల్సిందే. జగన్ బయటకు వస్తే జనానికి ఇబ్బందట…అందుకే ఆయన తప్పని సరి పరిస్థితుల్లోనే అడుగు బయటపెడతారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చక్కర్లు కొడుతోంది. జగన్ బయటకు వస్తే ఆయన పర్యటించే ప్రాంతంలో దుకాణాలు మూసివేయాల్సి వస్తుందని, అందుకే ఆయన బయటకు రారని ఆ పోస్ట్ సారాంశం.
ఈ నెల 21న జగన్ తణుకులో పర్యటిస్తున్నారని, ఈ సందర్భంగా దుకాణదారులంతా తమ దుకాణాలను నిర్దేశిత సమయంలో మూసివేయాలని దుకాణదారులకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాసిన లేఖ వైరల్ అయింది. ఆ లేఖను బేస్ చేసుకొని జగన్ పై మీమ్స్ పేలుతున్నాయి. బయటకు రావాలంట బయటకు…నేను తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వస్తే …మీరంతా దుకాణాలు మూసేయాలి…అంటూ జగన్ చెబుతున్నట్లు క్రియేట్ చేసిన మీమ్స్ వైరల్ అయ్యాయి. జగనన్న ‘మర్యాద రామన్న’లా ఎందుకయ్యారో తెలియక ఇన్నాళ్లూ అపార్థం చేసుకున్నామే అంటూ సెటైర్లు పేలుతున్నాయి.