దేశంలోని అతి పెద్ద రైల్వే వ్యవస్థలో భారత్ ఒకటి. ఓ వైపు బుల్లెట్ రైలు తెస్తానని ప్రధాని మోదీ చెబుతున్నారు. కానీ, మరోవైపు ప్యాసెంజర్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య తగ్గిస్తున్నారని, సామాన్య ప్రయాణికులకు రైలు ప్రయాణం నరక ప్రాయంగా మారిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అన్ని రైల్వే స్టేషన్లలో కవచ్ సిస్టం లేక ఘోర రైలు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకుండా వందేభారత్ రైళ్లపై ఫోకస్ చేస్తున్నారని మోదీపై కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయపడ్డారు.
ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు 14వ నంబర్ ప్లాట్‌ఫాంపై ఉందని చెప్పడంతో దాదాపు 2వేల మంది ప్యాసెంజర్లు వేచి ఉన్నారు. కానీ, రైలు బయలుదేరేందుకు మరో 10 నిమిషాల ముందు వేరే ప్లాట్ ఫాంపైకి ఆ రైలు వస్తుందని చెప్పడంతో భక్తులు ఒక్కసారిగా 14వ నెంబరు నుంచి మెట్ల మార్గం ద్వారా వేరే ప్లాట్ ఫాంపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మెట్లపై రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది.
ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు కేంద్రం ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.