ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణలో పర్యటించచాలని భావించారు. ఏపీ సరిహద్దు జిల్లాగా ఉన్న ఖమ్మంలో ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఆదివారం(ఏప్రిల్ 6) శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రఖ్యాత రామ క్షేత్ర భద్రాచలం ఆలయాన్ని పవన్ కల్యాణ్ సందర్శించాలని అనుకున్నారు. ఈ ప్రకారం ఏపీ అధికారులు పవన్ కల్యాణ్‌కు సంబంధించి ఖమ్మం టూర్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. కానీ, అనూహ్యంగా పవన్ టూర్ రద్దయింది.
తాను వస్తే భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగే అవకాశం ఉండడంతో పవన్ తన టూర్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ పర్యటన రద్దు అయినట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీకి సమాచారం అందింది. వాస్తవానికి హైదరాబాద్ లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో శనివారం సాయంత్రం 5 గంటలకు ఆయన భద్రాచలం చేరుకోవాల్సి ఉంది. రాత్రి భద్రాచలంలో బస చేసి, ఆదివారం నాడు స్వామి వారి కళ్యాణానికి హాజరై ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను, పట్టువస్త్రాలను సమర్పించాల్సి ఉంది. ఈ నెల 11న ఏపీలోని ఒంటిమిట్టలో కోదండరాములవారి కళ్యాణోత్సవం జరగనుంది. ఏపీ ప్రభుత్వం తరపున స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.