కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తమపై వేట కుక్కల్లా ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారని, తమపై జరగబోయే ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థల దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో రాజకీయ శూన్యత ఉందని, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌కు ఫుల్ క్లారిటీ ఉందని అన్నారు.
2024 లోక్ సభ ఎన్నికలే తమ లక్ష్యమని, ఆ సమయానికి బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఎదుగుతుందని అన్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీని గుజరాతీలు నడుపుతున్న సంగతి జనానికి తెలుసని విమర్శించారు. తమకు సమయం,అవకాశం ఇస్తే దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ అమలు చేస్తామని, గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ అని, తెలంగాణ మోడల్ దేశానికే రోల్ మోడల్ అని అన్నారు.
తెలంగాణలో అమలవుతోన్న రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, ఇంటింటికీ తాగు నీరు, దళిత బంధు తదితర కార్యక్రమాలు దేశమంతా అమలు చేయాలని పలు రాష్ట్రాల నుంచి డిమాండ్ లు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ సరిహద్దు జిల్లాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కు మద్దతు పెరుగుతోందని చెప్పారు. దేశంలో 10వేల మంది మొబైల్ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని, కిషన్ రెడ్డి కూడా ఆ జాబితాలో ఉన్నారని అన్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్‌పై ఉన్న కేసులు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు.
మరోవైపు, టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి…హైదరాబాద్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి వచ్చారు. తన కుమారుడు జేసీ అశ్మిత్ రెడ్డితో కలిసి వచ్చిన ఆయన ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. దివాకర్ ట్రావెల్స్ వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో విచారణకు వచ్చిన జేసీ..కాసేపటి తర్వాత వెళ్లిపోయారు.