కరోనా సంక్షోభం, లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులున్నా ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. అయితే, జగన్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని, గొప్పలకు పోయి ఏపీకి జగన్ అప్పులు మిగులుస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తలకు మించిన అప్పులు…దాని తాలూకా వడ్డీలు వెరసి పన్నుల రూపంలో జగన్ ప్రజల నడ్డి విరుస్తున్నారని విపక్ష నేతలు దుయ్యబడుతున్నారు.
ఏపీని జగన్ అప్పుల ఊబిలో దించుతున్నారని కంప్ట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ (కాగ్) గతంలోనే సంచలన విషయాలు వెల్లడించింది. జగన్ ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో 55 పైసలు అప్పుగా తీసుకొచ్చినవేనని కాగ్ తేల్చింది. ఇలా జగన్ ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టుకుంటూ పోతే ఏదో ఒకరోజు బ్యాంకులు తమ అప్పు, వడ్డీ సొమ్మును ముక్కుపిండి వసూలు చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నా జగన్ పట్టించుకోకుండా తప్పులు..అప్పులు చేస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా జగన్ సర్కార్ కు ఆర్బీఐ షాకిచ్చింది. ఏపీ సర్కార్ ఖాతాలోని డబ్బంతా RBI అప్పు, వడ్డీ కింద జమవేసుకోవడం సంచలనం రేపింది. ఈ కారణం వల్లే జూలైలో పదో తేదీ దాటినా ఇప్పటికీ పూర్తిగా ఉద్యోగులకు వేతనాలు అందలేదని తెలుస్తోంది. ఆర్బీఐ తాజా షాక్ తో జగన్ సర్కార్ ఏపీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని విమర్శలు వస్తున్నాయి.
బ్యాంకు నుంచి ప్రజలు అప్పు తీసుకొని నిర్ణీత గడువులోపు చెల్లించకుంటే…వారి ఖాతాలో నుంచి డబ్బులను అప్పు, వడ్డీ కింద బ్యాంకులు జమ వేసుకోవడం సర్వ సాధారణం. అయితే, బ్యాంకు నుంచి అప్పులు తీసుకున్న ప్రభుత్వానికి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో గడువులోపు జగన్ సర్కార్ అప్పు, వడ్డీ చెల్లించకపోవడంతో ఆర్బీఐ షాకిచ్చింది. రూ.3,470 కోట్ల భారీ మొత్తాన్ని ఓవర్డ్రాఫ్ట్లోకి జమ చేసుకోవడంతో జగన్ సర్కార్ ఇరకాటంలో పడింది.
గతంలో బకాయిలు చెల్లించకపోవడంతో ఏపీ సర్కార్ తాాజాగా తెచ్చుకున్న రూ.2వేల కోట్ల అప్పుతోపాటు, కేంద్రం ఇచ్చిన 1470 కోట్లను ఓవర్ డ్రాఫ్ట్ బకాయి కింద ఆర్బీఐ జమ చేసుకుంది. ఈ పరిణామంతో జగన్ సర్కారు పరపతి,పరువూ, మర్యాద మంటగలిసిపోయాయి. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత ఎక్కువ వడ్డీకి రూ.2వేల కోట్లు అప్పు చేసిన జగన్ కు వృతం..ఫలితం రెండూ చెడ్డాయి.
ఇక, రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన రూ.1470 కోట్లు కూడా బ్యాంకులు జమ వేసుకోవడంతో జగన్ కు షాక్ తగిలింది. ఓవర్
డ్రాఫ్ట్ ఖాతాలో బ్యాంకుల నుంచి తెచ్చుకున్న సొమ్మును నిర్దిష్ట గడువులోపు చెల్లించకపోవడంతోనే జగన్ తాజాగా చేసిన అప్పు హారతి కర్పూరం అయింది. అయితే, కథ ఇంతటితో అయిపోలేదు.ఓడీ కింద మరో రూ.800 కోట్లు చెల్లిస్తే గానీ ఏపీ సర్కార్ తాత్కాలికంగా ఊపిరి తీసుకోలేదు.
అంటే, మరో 800 కోట్లు అప్పు చేసినా…అది ఆర్బీఐ జమవేసుకుంటుంది. అయితే, ఓవర్ డ్రాఫ్ట్ బకాయి 80 శాతం జమ అయిన తర్వాత వేతనాలు, పెన్షన్లకు మరోసారి ఓడీకి వెళ్లవచ్చు. ఉద్యోగుల జీతాల కోసం ఓడీ రూ.1400కోట్లకు పైన తీసుకుంటే నాలుగు రోజుల్లోనే చెల్లించాలి. కానీ, ఆల్రెడీ అప్పుల కుప్ప పెరిగిపోవడంతో ఏపీ ఆర్థిక శాఖ ఆ ధైర్యం చేయలేకపోతోంది.