తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో సంచలనంగా మారాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకోవడం లేదంటూనే అవసరమైతే తాను రంగంలోకి దిగుతానని చెప్పారు. అంతేకాదు… తాను పోటీ చేస్తే తన ముందు ఎవరూ పనికిరారని ఆయన అన్నారు.
నరసరావుపేట లోక్ సభ టికెట్ కడప వాళ్లకు ఇస్తే సహకరించబోమని.. ఓడించి తీరుతామని రాయపాటి కుండబద్దలు కొట్టి చెప్పారు. ఆయన నేరుగా ఎవరి పేరూ ప్రస్తావించనప్పటికీ టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేశ్ యాదవ్‌ని లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ మాట అన్నట్లు అర్థమవుతోంది. పుట్టా మహేశ్ నరసరావుపేట టికెట్ కోసం పావులు కదుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. మహేశ్‌కు నరసారావుపేట టికెట్ ఇవ్వాలని యనమల రామకృష్ణుడు కూడా చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు.
పుట్టా మహేశ్ యనమల రామకృష్ణుడికి అల్లుడు. దీంతో అటు తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్, పిల్లనిచ్చిన మామ యనమల రామకృష్ణుడి సపోర్టుతో మహేశ్ యాదవ్ నరసరావుపేట టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ముఖ్యంగా రాయపాటికి వయసు అయిపోవడంతో ఆయన స్థానంలో తనకు టికెట్ ఇవ్వాలన్న వాదన మహేశ్ తీసుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రాయపాటి సాంబశివరావు కడప వాళ్లకు టికెట్ ఇస్తే ఓడిస్తాం అంటున్నారు. అంతేకాదు… తన కుమారుడు, కుమార్తెకు కూడా అసెంబ్లీ టికెట్లు కావాలంటున్నారు రాయపాటి. ఆ రెండు టికెట్లే కాకుండా తాడికొండ టికెట్ తన అనుచరుడు తోకల రాజవర్దన్ రావుకు ఇవ్వాలని రాయపాటి డిమాండ్ చేస్తున్నారు.