చంద్రబాబునాయుడును ఇరుకుపెట్టడానికి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బాగానే ప్రయత్నిస్తున్నారు. దాదాపు 80 ఏళ్ళ వయసులో కూడా టికెట్ల విషయంలో తనపంతం నెగ్గించుకునేందుకు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో తమ కుటుంబానికి మూడు టికెట్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. కొంతకాలంగా వీల్ ఛైర్ కు పరిమితమైన ఈయన వచ్చేఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీచేస్తారట.
అలాగే సత్తెనపల్లి లేదా పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఎక్కడైనా తన కొడుక్కు రంగబాబుకు టికెట్ కావాలట. ఇక తమ్ముడి కూతురు డాక్టర్ శైలజకు కూడా ఒక టికెట్ కావాలట. ఈమెకు మాత్రం ఎక్కడ టికెట్ ఇచ్చినా పర్వాలేదని చంద్రబాబుకే ఛాయిస్ ఇచ్చేశారు. శైలజేమో గుంటూరు వెస్ట్ లేదా ఈస్ట్ నియోజకవర్గంలో పోటీచేయాలని అనుకుంటున్నట్లు తమ్ముళ్ళ టాక్. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో రాయపాటి వల్ల చంద్రబాబుకు తలనొప్పులు తప్పవనే అనిపిస్తోంది.
ఇందుకు మూడు కారణాలున్నాయి. మొదటిదేమో తన బద్దశతృవు కన్నా లక్ష్మీనారాయణను టీడీపీలో చేర్చుకోవటాన్ని రాయపాటి జీర్ణించుకోలేకపోతున్నారు. రెండో కారణం ఏమిటంటే నరసరావుపేట ఎంపీ టికెట్ ను మైదుకూరు మాజీ ఎంఎల్ఏ పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు కమ్ యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ కు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ చేశారనే ప్రచారం నడుస్తోంది. ఇక మూడో కారణం ఏమిటంటే రాయపాటి ఫ్యామిలికి మహా అయితే ఎక్కడైనా ఒక టికెట్ దక్కే అవకాశముందంతే.
తనకన్నా తన ప్రధానశతృవు కన్నాకి చంద్రబాబు మ్యాగ్జిమమ్ ఇంపార్టెన్స్ ఇవ్వటాన్ని రాయపాటి తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి టెన్షన్లు రాయపాటిలో పెరిగిపోతున్నట్లున్నాయి. అందుకనే ఫ్యామిలి ప్యాకేజీలో మూడు టికెట్లు ఇచ్చి తీరాల్సిందే అని తాజాగా బయటపడ్డారు. మరి చంద్రబాబు ఫ్యామిలి ప్యాకేజీ ఇవ్వకపోతే ఏమిచేస్తారు ? రాయపాటి వల్ల జిల్లాలో టీడీపీ ఎన్నిసీట్లు గెలుస్తుందో తెలీదు కానీ కొన్ని సీట్లలో ఓడిపోతుందని మాత్రం అనిపిస్తోంది. ఎందుకంటే పార్టీలోనే ఉంటు పార్టీ అభ్యర్ధులకే వెన్నుపోటు పొడిస్తే ఏ పార్టీ అయినా ఓడిపోక ఏమిచేస్తుంది ?