ఎవ్వరూ ఊహించని పరిణామం ఇది. క్రేజీ ప్రాజెక్ట్ అనుకున్న సినిమాను హఠాత్తుగా ఆపేశారు. డాన్ లాంటి హిట్.. బలుపు, క్రాక్ లాంటి బ్లాక్బస్టర్లు ఇచ్చిన రవితేజ -గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఎంతో అట్టహాసంగా ప్రకటించిన ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ హోల్డ్‌లో పెట్టారన్న వార్త టాలీవుడ్‌కు బిగ్ షాక్. మైత్రీ వాళ్లంతా భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరు. ఒక సినిమాకు అవసరమైందానికంటే ఎక్కువ ఖర్చయినా వెనుకంజ వేయరని అంటారు.
అలాంటి నిర్మాతలు ఇలాంట క్రేజీ కాంబినేషన్లో సినిమాను బడ్జెట్ సమస్యలతో ఆపేశారంటే ఆశ్చర్యంగా ఉంది. ఉన్నట్లుండి తెలుగు సినిమాల డిజిటిల్ రైట్స్ రేట్లు పడిపోవడం.. పేరున్న సినిమాలకు కూడా డిజిటల్ బిజినెస్ కాకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. పారితోషకాలు, ప్రొడక్షన్ కాస్ట్ అన్నీ కలిపితే ఈ ప్రాజెక్టుకు రూ.120 కోట్ల దాకా అయ్యేలా ఉందట. ఆ మొత్తం రికవరీ అసాధ్యమన్న ఉద్దేశంతో సినిమా ఆపేసినట్లు చెబుతన్నారు.
ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే.. దర్శకుడు గోపీచంద్ మైత్రీ వాళ్లతోనే తన తర్వాతి చిత్రం చేయబోతున్నాడు. వేరే హీరోను చూస్తున్నారట. అంటే రవితేజతో ఈ సినిమా వర్కవుట్ కాదని మైత్రీ వాళ్లు ఫిక్సయ్యారట. ప్రధానంగా రవితేజ పారితోషకం దగ్గరే సమస్య వచ్చినట్లు చెబుతున్నారు. డిజిటల్ మార్కెట్ పెరిగాక కొందరు హీరోలు తమ పారితోషకాలను డబుల్, అంతకంటే ఎక్కువే చేసేశారు. రవితేజ కూడా ఒకరు. గోపీచంద్ సినిమాకు పాతిక కోట్లు డిమాండ్ చేశాడట మాస్ రాజా.
ఐతే డిజిటల్ ఆ మార్కెట్ దెబ్బ తిన్న నేపథ్యంలో హీరోకు అంత పారితోషకం ఇచ్చి సినిమాను వర్కవుట్ చేయడం కష్టమని మైత్రీ వాళ్లు ఆలోచనలో పడ్డారట. పారితోషకం తగ్గించుకోవాలని రవితేజను అడిగినా ఆయన ససేమిరా అన్నారని.. అందుకే అన్నీ ఆలోచించి సినిమాను పక్కన పెట్టారని అంటున్నారు. రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ అస్సలు రాజీపడడని ఎప్పట్నుంచో టాలీవుడ్లో టాక్ ఉంది. గతంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా దిల్ రాజు మొదలుపెట్టి సినిమా ఆపేయడానికి కూడా కారణం రెమ్యూనరేషన్ ఇష్యూలే అని వార్తలొచ్చాయి. దీంతో ఇప్పుడు గోపీచంద్ మూవీ ఆగిపోవడానికి కూడా రవితేజనే కారణంగా చెబుతున్నారు.