ఈ సంక్రాంతికి ఎన్నడూ లేనంత పోటీ చూడబోతున్నాం టాలీవుడ్ బాక్సాఫీస్ లో. గుంటూరు కారంతో పాటు హనుమాన్, ఈగల్, సైంధవ్, నా సామిరంగా సంక్రాంతి బరిలో నిలిచాయి. ఒకే వీకెండ్ లో ఐదు సినిమా లు రిలీజ్ అవుతుండడంతో వీటికి థియేటర్ల సర్దుబాటు ఎలా అని టాలీవుడ్ జనాలు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పండుగ బరిలో ఉన్న ఐదు సినిమాలు నిర్మాతలతో దిల్ రాజు నేతృత్వంలో సమావేశం కూడా నిర్వహించారు.
ఒకటి లేదా రెండు సినిమాలను సంక్రాంతి నుంచి తప్పించాలని గట్టిగా ప్రయత్నం జరుగుతోంది. అయితే పోటీ నుంచి చివరికి ఎవరు తప్పుకుంటారో కానీ ప్రస్తుతానికి మాత్రం ఐదు సినిమాలు సంక్రాంతికే గురిపెట్టాయి. రిలీజ్ పనులు ఒకవైపు జరుగుతుండగా మరోవైపు ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. హనుమాన్ టీం ఇందులో భాగంగానే ప్రమోషన్లు పరంగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వదిలింది. ఇందులో హనుమంతుడి రూపమైన కోతి పాత్రకు మాస్ రాజా రవితేజ గాత్ర దానం చేస్తుండడం విశేషం. రవితేజ సినిమా ఈగల్ సైతం సంక్రాంతి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.
అయినా సరే తన చిత్రానికి పోటీగా ఉన్న హనుమాన్ కు ఇలా రవితేజ మాట సాయం చేయడం విశేషమే. ఇది మాస్ రాజా మంచి మనసుకు నిదర్శనం. గతంలో రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు మంచి ఫలితాన్ని అందుకున్నాయి. రాజమౌళి మర్యాద రామన్నతో పాటు ఈమధ్య వచ్చిన తమిళ అనువాద చిత్రం మహావీరుడుకు సైతం మాస్ రాజా వాయిస్ పెద్ద అసెట్ అయింది. అట్రాక్టివ్ గా అనిపించే ఆయన గొంతు హనుమాన్ సినిమాలోని కోతి పాత్రకు కూడా ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం హనుమాన్ సినిమా జనవరి 12న రాబోతుండగా ఆ మరుసటి రోజు ఈగల్ రిలీజ్ అవుతుంది.