మాస్ రాజా రవితేజ తన తోటి, చిన్న హీరోలకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ‘మర్యాదరామన్న’ సహా పలు చిత్రాలకు ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాక.. ప్రమోషన్ల పరంగా కూడా సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. కమెడియన్ హర్ష చెముడు హీరోగా నటిస్తున్న ‘సుందరం మాస్టారు’ అనే చిన్న సినిమాలోనూ రవితేజ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక మాస్ రాజా తమిళ యంగ్ హీరోలను సైతం సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. విష్ణు విశాల్ నటించిన రెండు సినిమాలను ఆయన తెలుగులో సమర్పించాడు. ఇప్పుడు మరో తమిళ యంగ్ హీరోకు రవితేజ మాట సాయం చేయబోతున్నాడు. ఆ హీరోనే.. శివ కార్తికేయన్. ఇప్పటికే ‘వరుణ్ డాక్టర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని.. ‘ప్రిన్స్’తో టాలీవుడ్లోకి డైరెక్టర్ ఎంట్రీ కూడా ఇచ్చిన శివ.. ఇప్పుడు ‘మహావీరుడు’తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
ఈ శుక్రవారమే ‘మహావీరుడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ ఎంటర్టైనింగ్గా సాగడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా ట్రైలర్లో హీరోకు ఏదో అయి.. తలెత్తి పైకి చూసే షాట్లు అందరి దృష్టినీ ఆకర్షించాయి. సినిమాలో మేజర్ ట్విస్టు ఇదేనట. హీరోకు ఒక ప్రమాదంలో తలకు దెబ్బ తగిలి.. తనకు ఏదో వాయిస్ వినిపించి పైకి చూస్తూ ఉంటాడట. అప్పుడు అతడికి వినిపించే వాయిస్‌ను అనుసరించి ఎప్పుడేం చేయాలో డిసైడ్ అవుతుంటాడట.
తమిళంలో ఈ వాయిస్ ఇచ్చింది విజయ్ సేతుపతి కాగా.. తెలుగులో మాస్ రాజాతో వాయిస్ ఓవర్ ఇప్పించారట. రవితేజ వాయిస్ ఎంటర్టైనింగ్గా ఉండటమే కాక తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాతో కనెక్ట్ కావడానికి ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఇంతకుముందు ‘మండేలా’ అనే ప్రయోగాత్మక చిత్రంతో ఆకట్టుకున్న మడోన్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.