వైసీపీ నేతలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియా సాగుతోందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు నేతల ఆధ్వర్యంలో రేషన్ బియ్యం మాఫియా రాజ్యమేలుతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలోనే అతిపెద్ద బియ్యం కుంభకోణం ఏపీలో జరుగుతోందని ఆరోపించారు.
అంతేకాదు, ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మూడున్నరేళ్ల జగన్ పాలన స్కాములతో నడిచిందని, పేదోడి రేషన్ బియ్యంపై కూడా కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. ఈ బియ్యం కుంభకోణానికి ఇద్దరు రథసారథులున్నారని, ఒకరు ‘ఖతర్నాక్ కారుమూరి’ నాగేశ్వరరావు అని, ఇంకొకరు ‘దోపిడీకి ద్వారం’.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని సెటైర్లు వేశారు.
ఈ ఇద్దరు బియ్యం బకాసురులు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని, కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసి వేల కోట్లు జగన్ రెడ్డి ఖజానాకు తరలిస్తున్నారని పట్టాభి ఆరోపించారు. రాష్ట్రంలో బియ్యం దిగుబడులు పెరగలేదని, కానీ, కాకినాడ పోర్టు నుండి బియ్యం ఎగుమతులు మాత్రం పెరుగుతున్నాయని ఆరోపించారు. 2018-19లో బియ్యం దిగుబడులు 82.30 లక్షల టన్నులని, అదే 2020-21 నాటికి 78.90 లక్షల టన్నులకు తగ్గాయని అన్నారు.
బియ్యం ఎగుమతులు 2018-19లో 18.09 లక్షల టన్నులని, 2020-21 నాటికి 31.51 లక్షల టన్నులని, 2021-22 నాటికి ఏకంగా 48.26 లక్షల టన్నులకు చేరడమే ఆ బియ్యం మాఫియా ఆరోపణలకు నిదర్శనమని అన్నారు. పంట దిగుబడులు పెరగలేదని కేంద్రం నివేదికలు చెబుతున్నాయని, బియ్యం ఎగుమతి వల్లే ఇలా జరుగుతోందని పట్టాభి అన్నారు.