ప్రభుత్వం మారిన తర్వాత కొత్త సంక్షేమ పథకాలు రావడం సహజం. పాత ప్రభుత్వం పథకాల రంగు, రుచి, వాసన ఏమీ రాకుండా కొత్తగా వచ్చిన ప్రభుత్వం పాత పథకాలకు మేక్ ఓవర్ చేయడం…పేర్లు మార్చడం…కొన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టడం షరా మామూలే. అయితే, ఏ ప్రభుత్వమైనా ఏదైనా కొత్త పథకం ప్రవేశపెట్టే ముందు దాని వల్ల ప్రభుత్వానికి అయ్యే ఖర్చెంత? ప్రజలకు చేకూరే మేలెంత? అన్నది బ్యారీజు వేసుకోవాల్సి ఉంటుంది.
ఇక, ఆల్రెడీ అమలులో ఉన్న పథక రూపురేఖలు మార్చాలనుకున్నపుడు ఆ రెండు విషయాలను మరింత లోతుగా పరిశీలించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వానికి మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక వేళ ఆ పరిశీలన చేయకుండా…క్షేత్ర స్థాయిలో ఆ పథకం అమలు, సాధ్యాసాధ్యాలు చూడకుండా ఆ పథకాన్ని మూర్ఘంగా అమలు చేస్తే ఇటు ప్రభుత్వానికి …అటు ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.
మాట తప్పను…మడమ తిప్పను అంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో ఏపీ సీఎం జగన్ అనాలోచితంగా అమలు చేస్తున్న ఓ పథకంతో అటు ప్రభుత్వం…ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటింటికీ రేషన్ అంటూ జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డోర్ డెలివరీ కాన్సెప్ట్ డిజాస్టర్ అయింది. ఇంటింటికీ రేషన్ డెలివరీతో ప్రజలు ప’రేషాన్’ అవుతున్న వైనంపై సర్వత్రా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
రేషన్ షాపుల వ్యవస్థ ఎన్నో ఏళ్లుగా ఒక క్రమ పద్ధతిలో నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతి నెల ఒకటో తారీకు నుంచి 15వ తారీకు వరకు రేషన్ పంపిణీ జరుగుతుండగా….వినియోగదారులు తమ వెసులుబాటును బట్టి ఏదో ఒకరోజు నిర్దేశిత సమయంలో రేషన్ తెచ్చుకునేవారు. ఆ పద్ధతిలో రేషన్ డీలర్లకు నెలనెలా టంచన్ గా కమీషన్ వచ్చేది. ఇదంతా గతం. ఇపుడు, జగన్ హయాంలో రేషన్ పంపిణీ ప్రక్రియ ఓ ప్రహసనం.
ప్రస్తుతం జగనన్న పాలనలో రేషన్ పంపిణీని 15నుంచి18 రోజులకు పెంచారు. అంతేకాదు, ఏ రోజు ఎక్కడ డెలివరీ చేయాలో మ్యాపింగ్ చేశారు. దీంతో, రేషన్ డెలివరీ వాహనం కోసం ప్రజలు పనులు మానుకొని పడిగాపులు కాయాల్సి వస్తోంది. అంతేకాదు, వాహనం వచ్చే సమయానికి కార్డుదారుల్లో వేలిముద్ర పడే వ్యక్తి తప్పనిసరిగా ఇంటి దగ్గరే ఉండి సరుకులు డెలివరీ తీసుకోవాలి. ఒకవేళ వాహనం వచ్చిన సమయానికి సరుకులు తీసుకోకుంటే, మళ్లీ వాహనం వద్దే తీసుకోవాలి తప్ప రేషన్ షాపునకు వెళ్లి రేషన్ తీసుకునే వెసులుబాటు లేదు.
సరే, ఇంటి దగ్గరకు రేషన్ తెచ్చిస్తుంటే తీసుకోవడానికి ఏం ఇబ్బంది అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అయితే, డెలివరీ వాహనాలు ఇంటింటికి వెళితే….వాహన డ్రైవర్ ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ చేస్తే వినియోగదారులకు ఇబ్బందేమీ లేదు. కానీ, క్షేత్ర స్థాయిలో జరుగుతోంది వేరు. డోర్ డెలివరీ వాహనాన్ని రేషన్ డీలర్, సంబంధిత వాలంటీర్ లు ఒక వీధిలో ఆపి అక్కడికే ఆ వార్డులో సంబంధిత రేషన్ షాపు తాలూకు కార్డుదారులంతా రావాలని చెబుతున్నారు.
అదేంటీ, ఇంటింటికీ రేషన్ డెలివరీ కదా అని అడిగితే…నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో, ఇంటింటికీ రేషన్ కాస్తా వీధిలో పరేషాన్ అయిందననుకుంటూ వినియోగదారులు…గతంలో మాదిరి రేషన్ షాపునకు వెళ్లే బదులు…నడి వీధిలో డోర్ డెలివరీ వాహనం ముందు క్యూలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. దీనికి తోడు, ఒక సారి వాహనంలో 500 కేజీల బరువు మాత్రమే తీసుకురావాల్సి ఉంటుంది.
దీంతో, ఒక లోడ్ అయిపోతే…మరో లోడ్ వచ్చేవరకు రేషన్ కార్డులు సీరియల్ లో పెట్టిన వినియోగదారులంతా చచ్చినట్టు అక్కడే వేచి ఉండక తప్పని పరిస్థితి. పోనీ, ఇంటి దగ్గరలో వాహనం నిలిపితే…ఇంట్లో పనులు చూసుకొని మళ్లీ వచ్చి రేషన్ తీసుకోవచ్చు. ఏదో ఒక వీధి చివరో…డీలర్, వాలంటీర్ కు అనుకూలంగా రెండు, మూడు వీధులు కలిసే పాయింట్ దగ్గరో వాహనం నిలపడంతో ప్రజలు ఇక్కట్టు పడుతున్నారు.
ఇదే, గతంలో అయితే, రేషన్ షాపులో సరిపడినంత స్టాకుండేది కాబట్టి ఈ సమస్యే ఉత్పన్నమ్యేది కాదు. ఒకవేళ, జనం ఎక్కువగా ఉన్నా…మరుసటి రోజో, కుదిరిన రోజో వచ్చి రేషన్ తీసుకునే చాన్స్ ఉంది. అదీగాక, పాత విధానంలో అయితే, జనం వేర్వేరు రోజుల్లో వేర్వేరు సమయాల్లో వచ్చేవారు కాబట్టి రేషన్ షాపు దగ్గర 10-20 మందికంటే ఎక్కువ ఉండేవారు కాదు.
ఇపుడు, రేషన్ వాహనం వెళితే మళ్లీ రాదేమో అన్న కంగారులో అందరూ వాహనం దగ్గర గుమిగూడడంతో జనాన్ని జగన్ నడిరోడ్డులో నిలబెట్టినట్టయింది. ఇదంతా ప్రజల బాధ. ఇక, ఈ పథకంలో వాహనాలు నడుపుతున్న డ్రైవర్లది మరో బాధ. తమను ఉంచుతారో ఊడగొడతారో తెలీక…భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిన రేషన్ షాపు డీలర్లది ఈతి బాధ. ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయని వైసీపీ నేతలది అసలు బాధ.
రేషన్ పంపిణీ కోసం ఒక్కో వాహనం రూ.5.81లక్షలు చొప్పున రూ.539 కోట్లు పెట్టి 9260 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వినియోగదారులకు ఇవ్వడానికి 2.1కోట్ల చేతి సంచుల కోసం మరో రూ.40 కోట్లు ఖర్చుపెట్టారు. డ్రైవర్లకు నెలకు రూ.16వేలు వేతనం చొప్పున ప్రతినెలా రూ.15కోట్లు…ఏడాదికి రూ.180 కోట్లు అదనపు భారం. సరే, ఈ ఖర్చంతా పక్కనబెడితే ఏపీలోని 29 వేల మంది డీలర్లకు రూ.22 కోట్లు కమీషన్ ఇవ్వక తప్పదు.
వాహనాలకు వైసీపీ రంగులు…అదనపు హంగులు…కాటాలు గట్రా వ్యవహారాలకు అదనపు ఖర్చు వెరసి ఇంటింటికీ రేషన్ పథకం కోసం ప్రభుత్వంపై రూ.700 కోట్లు భారం పడుతోంది. అదే, డోర్ డెలివరీ విధానానికి ముందు డీలర్లకిచ్చే రూ.22 కోట్ల కమీషన్ ఇస్తే ఏటా రూ.224 కోట్లతో రేషన్ పంపిణీ తంతు ముగిసేది. రఫ్ గా చూసినా ప్రభుత్వానికి రూ.500 కోట్లు మిగిలేవి. పోనీ, ఇంతా ఖర్చు పెడితే…ఇటు ప్రజలకు అదనపు సౌకర్యానికి బదులు అసౌకర్యం కలుగుతోంది.
ఇక, డ్రైైవర్ల బాధలు వర్ణనాతీతం. ముందు తమకు చెప్పిన దాని కంటే ఎక్కువగా పనులు చేయాల్సి వస్తోందని, డ్రైవింగ్, కాటా వేయడం, డెలివరీ చేయడం వంటి పనులన్నీ ఒక్కరే చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. అదీగాక, వాహనంపై నిర్దేశించిన లోడ్ 500 కేజీల బరువు మాత్రమే వేసుకోవాల్సి రావడంతో పదేపదే రేషన్ షాపునకు, కార్డుదారుల ఇళ్లకు తిరగాల్సి వస్తోందని, లోడ్ చేసేందుకు డీలర్లు సహాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని చోట్ల తమకిచ్చే రూ.16వేలు సరిపోవడం లేదంటూ డోర్ డెలివరీ వాహనాల డ్రైవర్లు ధర్నాలు చేయడంతో జగన్ సర్కార్ కళ్లు తెరిచింది. గతంలో డ్రైవర్లకిచ్చే రూ.15 వేలకు బదులుగా రూ.21వేలు ఇవ్వాలని నిర్ణయించింది. వాహనం అద్దెను రూ.10 వేల నుంచి రూ.13 వేలకు, వాహనదారుడి సహాయకుడికి చెల్లించే హెల్పర్ చార్జీలను రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచాలని నిర్ణయించింది. పెట్రోల్ కోసం చెల్లించే రూ.3 వేలు యథాతధంగా చెల్లించనుంది.
ఈ కంటితుడుపు చర్యతో డ్రైవర్లు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందకపోయినప్పటికీ…ప్రస్తుతానికి అలా తమ బతుకుబండి నెట్టుకొస్తున్నారు. ఇలా డ్రైవర్లే అన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి…కొంతకాలం తర్వాత రేషన్ డీలర్లను తొలగిస్తారన్ప ప్రచారంతో డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రూ.700 కోట్లు ఖర్చుపెట్టి ఇంతా చేస్తే…ప్రజలు, రేషన్ డీలర్లు, వాహనదారులు…ఎవ్వరూ సంతృప్తి చెందకపోవడంతో ఈ పథకం అట్టర్ ప్లాప్ అయిందన్న విమర్శలు వస్తున్నాయి.
ఇంకా చెప్పాలంటే ఈ పథకం అమలుపై కొంతమంది ప్రభుత్వ పెద్దలు, ఉన్నత స్థాయి అధికారులు కూడా సంతృప్తి చెందలేదన్న ప్రచారం జరుగుతోంది. కేవలం జగన్ చెప్పారు…చెయ్యాలి అన్న రీతిలో పథకాన్ని ప్రారంభించేశారన్న వాదన వినిపిస్తోంది. అదేమంటే అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొని, ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని, అక్రమ రేషన్ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిందని జగన్ సర్కార్ చెబుతోంది.
ఇలా ఇంటింటికీ రేషన్ డోర్ డెలివరీ అంటూ రూ.700 కోట్లు ఖర్చు పెట్టి మరీ జనాన్ని జగన్ నడిరోడ్లో నిలబెట్టారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా కళ్లు తెరచి భవిష్యత్తులో ఈ ఒంటెత్తు పోకడలు మాని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కష్టపడి పన్నులు చెల్లిస్తున్న ప్రజల సొమ్ముతో ప్రభుత్వం సోకులు చేసుకోవడం కోసం ఈ తరహా అట్టర్ ప్లాప్ పథకాలు, ఉచిత పథకాలు ప్రవేశపెట్టే ముందు జగన్ అయినా…మరో ముఖ్యమంత్రి అయినా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా, జనం జగన్ మాట విని ఓట్లేసి గెలిపించారుగానీ…జగన్ జనం మాట వింటారనుకోవడం అత్యాశే అవుతుందేమో కదా.