ఈ టెక్ జమానాలో ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ వీడియోల బెడద ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు అందరూ ఈ మార్ఫింగ్, ఫేక్ డీప్, ఫేక్ ఫోటోల వీడియోల బాధితులే అంటే అతిశయోక్తి కాదు. ఈ కోవలోనే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఒకటి వైరల్ కావడం సంచలనం రేపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి రష్మిక మందన్న అర్ధ నగ్న వీడియో ఒకటి చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై రష్మిక తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ వీడియోపై వివరణ ఇవ్వాల్సి రావడం ఎంతో బాధ కలిగించిందని రష్మిక అన్నారు. ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవడం భయానకంగా అనిపిస్తుందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. తన కుటుంబం, సన్నిహితులు, శ్రేయోభిలాషులు తనకు రక్షణ కవచం వంటి వారని, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఇదే వీడియో కాలేజీ చదివే రోజుల్లో ఎదురైతే తానేం చేయగలను అన్న ఊహ తనకు భయం కలిగిస్తుందని చెప్పారు. ఇటువంటి డీప్ ఫేక్ వీడియోలను నివారిండచం ఎలా అన్న విషయంపై సోషల్ మీడియాలో, మీడియాలో చర్చ జరగాలని అన్నారు.
ఇక, రష్మిక ఫేక్ న్యూడ్ వీడియోపై కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందించారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచార వ్యాప్తిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఆయా వేదికలదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం లేదా యూజర్లు ఫిర్యాదు చేసిన 36 గంటల్లోపు తప్పుడు సమాచారాన్ని సంస్థలు తొలగించాలన్నారు.