హీరోయిన్లంతా సౌత్‌లో స్టార్డమ్ రాగానే నార్త్వైపు దృష్టి మళ్లిస్తుంటారు.
అసిన్, ఇలియానా, కాజల్, రష్మిక మందాన్న, పూజా హెగ్డే లాంటివారంతా అదే చేస్తున్నారు. వీరిలో కొందరు నార్త్ ఇండియన్సే అయినా సౌత్‌లో విజయం సాధించాకే బాలీవుడ్ చాన్సెస్ వచ్చాయి.
ఇప్పుడు రాశీఖన్నా చూపు కూడా బాలీవుడ్ వైపే ఉంది. ఆల్రెడీ రెండు ప్రెస్టీజియస్ వెబ్ సిరీసుల్లో చోటు సంపాదించింది. ఇప్పుడు సినిమాల్లోకి అడుగు పెడుతోంది.
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తోంది రాశీఖన్నా. అలాగే షాహిద్ కపూర్ లీడ్ రోల్లో ‘ద ఫ్యామిలీ మేన్’ని తీసిన రాజ్, డీకే ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్‌లోనూ రాశి ఫిమేల్ లీడ్‌గా కనిపించబోతోంది.
ఇప్పుడు ఓ హిందీ సినిమాలో కూడా చాన్స్ కొట్టేసింది. అది కూడా కరణ్ జోహార్ ప్రొడక్షన్లో. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా ‘యోధ’ అనే మూవీని ఇవాళ ప్రకటించాడు కరణ్ జోహార్. సాగర్ ఆంబ్రే, పుష్కర్ ఓఝా డైరెక్టర్ చేయనున్నారు.
తాజాగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడంతో పాటు వచ్చే యేడు నవంబర్ 11న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను రిలీజ్ చేయనున్నామని కూడా చెప్పేశారు.
ఈ మూవీతోనే రాశీఖన్నా బాలీవుడ్లో అడుగు పెడుతున్నట్లు తెలిసింది. ఆమెతో పాటు దిశా పటానీ మరో హీరోయిన్గా నటించనుంది.
నిజానికి రాశికి బాలీవుడ్ కొత్తేమీ కాదు. అసలు ఆమె కెరీర్‌ను స్టార్ట్ చేసిందే అక్కడ. జాన్ అబ్రహామ్ హీరోగా సూజిత్ సర్కార్ తీసిన ‘మద్రాస్ కేఫ్’లో రూబీ సింగ్ అనే పాత్రతో నటిగా తన ప్రయాణం మొదలుపెట్టింది.
ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు రావడంతో ఇక్కడే సెటిలైపోయింది. తమిళ, మలయాళ భాషల్లోనూ నటిస్తోంది. ఇప్పుడు బ్యాక్ టు బాలీవుడ్ అంటోంది.
అయితే సౌత్‌లో ఎంత సక్సెస్ఫుల్ హీరోయిన్గా వెలిగినా.. నార్త్‌కి వెళ్లి పాతుకుపోయినవాళ్లు మాత్రం ఈమధ్య కాలంలో ఎవరూ లేరు.
శ్రీదేవి, జయప్రద లాంటి వారితోనే ఆ పరంపరకి ఫుల్స్టాప్ పడిపోయింది. ఆ తర్వాతి కాలంలో ఎవరు బీటౌన్‌కి వెళ్లినా ఒకట్రెండు సినిమాలు చేసి తిరిగొచ్చేయడమే.
అవకాశం వస్తే అప్పుడప్పుడు వెళ్లి ఓ ప్రాజెక్టులో మెరుస్తుంటారు. అంతే తప్ప టాప్ పొజిషన్‌కి వెళ్లినవాళ్లు ఎవరూ లేరు.
ఇప్పుడిప్పుడే పూజా హెగ్డే, రష్మిక లాంటి వారు కాస్త మంచి ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పుడు రాశి మొదలుపెట్టింది. మరి వీళ్లయినా అక్కడ చక్రం తిప్పుతారేమో చూడాలి.