బాలీవుడ్లో క్రేజీయెస్ట్ ఫ్రాంఛైజీగా మారిన సినిమా అంటే.. ‘ధూమ్’యే. ఇలా ఒకే రకమైన క్యారెక్టర్లు, కాన్సెప్ట్‌లతో ఫ్రాంఛైజీలు సినిమాలు రావడానికి పునాది వేసింది ఆ మూవీనే. మొదటగా జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్ కాంబినేషన్లో యశ్ రాజ్ ఫిలిమ్స్ తీసిన ‘ధూమ్’ అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత అభిషేక్‌ను పోలీస్ పాత్రలో కొనసాగిస్తూ హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్‌లను దొంగల పాత్రలకు తీసుకుని తీసిన ధూమ్-2, ధూమ్-3 కూడ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఐతే ధూమ్-3 వచ్చి 11 ఏళ్లు గడిచినా ఇంకా ధూమ్-4 మాత్రం రాలేదు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంటూ ధూమ్-4 హీరో గురించి ప్రచారాలు జరిగాయి కానీ.. అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఐతే ఎట్టకేలకు ధూమ్-4ను పట్టాలెక్కించడానికి యశ్ రాజ్ ఫిలిమ్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి బాలీవుడ్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో ‘ధూమ్-4’ తీయబోతున్నారట. ‘యానిమల్’ మూవీతో రణబీర్ రేంజే మారిపోయింది. మాస్లో అతడికి తిరుగులేని ఫాలోయింగ్ వచ్చింది. ఇన్నాళ్లూ రణబీర్ మీద క్లాస్ హీరో అనే ముద్ర ఉండేది. ఇప్పుడది చెరిగిపోయింది. తన మార్కెట్ కూడా విస్తరించింది. ఈ దశలో ‘ధూమ్-4’ లాంటి మాస్ టచ్ ఉన్న యాక్షన్ మూవీ చేస్తే దాని రేంజే వేరుగా ఉంటుంది.
షారుఖ్ లేదా సల్మాన్ చేసినా ‘ధూమ్-4’ బాగానే ఉండొచ్చు కానీ.. ‘యానిమల్’ తర్వాత రణబీర్ నటిస్తే‘ధూమ్-4’ ఇంకా క్రేజీగా తయారవడం ఖాయం. అందుకే అతడితోనే ‘ధూమ్-4’ చేయడానికి యశ్ రాజ్ ఫిలిమ్స్ దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసిందని.. అతను కూడా ఓకే చెప్పాడని అంటున్నారు. ఐతే ఈ చిత్రానికి దర్శకుడెవరన్నది ఇంకా వెల్లడి కాలేదు. ఈ మూవీలో తమిళ స్టార్ సూర్య ఓ కీలక పాత్ర చేస్తాడని కూడా ఒక క్రేజీ రూమర్ వినిపిస్తుండడం విశేషం.