కరోనా పుణ్యమా అంటూ ఓటీటీలో కంటెంట్ కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఓటీటీ కంటెంట్ ను రూపొందించడంలో ఉత్తరాది వారు దక్షిణాదితో పోలిస్తే ముందంజలో ఉన్నారు. ఇక, కోలీవుడ్ లో కొన్ని వెబ్ సిరీస్ లు ఆల్రెడీ అలరించాయి. ఓటీటీ కంటెంట్ విషయంలో ఆలస్యంగా మేలుకొన్న తెలుగు హీరోలు, నటీనటులు ఈ మధ్యే చిన్నా చితకా వెబ్ సిరీస్ లతో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇటువంటి తరుణంలో టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో దగ్గుబాటి రానాలు ఓ వెబ్ సిరీస్ లో కలిసి నటించడం చర్చనీయాంశమైంది. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కోసం బాబాయి, అబ్బాయిలు కలిసి ‘రానా నాయుడు’ అనే యాక్షన్ ప్యాక్డ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. నెవర్ బిఫోర్ లుక్ లో వెంకీ అదరగొట్టాడు. ఇక, యాక్షన్ సీన్లలో వెంకీతో తలపడే రానా దుమ్మురేపాడు.
ఈ సిరీస్ హిందీ వెర్షన్ టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. రానా తండ్రిగా వెంకీ డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్నారు. తండ్రిని ద్వేషించే కొడుకుగా రానా వెంకీ తలకే గన్ పెట్టిన సీన్ ఈ టీజర్ కే హైలైట్. ఈ ఇద్దరి మధ్య అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉన్నట్లు టీజర్ లో కనిపించింది. జైల్లో చేతులకి సంకెళ్లతో పొడవాటి తెల్లగడ్డంతో వెంకీ మునుపెన్నడూ లేని లుక్ లో కనిపించడం విశేషం.
పాపులర్ అమెరికన్ సిరీస్ ‘రే డోనోవర్’ కు ఇండియన్ అడాప్షన్ వెర్షన్ గా రానా నాయుడు తెరకెక్కుతోంది. ముకుల్ చద్దా కీలక పాత్ర పోషించిన ఈ. వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల కాబోతోంది. “దగ్గుబాటి Vs దగ్గుబాటి’’అంటూ నెట్ ఫ్లిక్స్ ఈ టీజర్ రిలీజ్ చేసింది. అయితే ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు విడుదల అవుతుందనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. భారతీయ నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసిన ఈ పాపులర్ వెబ్ సిరీస్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి