దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సీరిస్ ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ముఖ్యంగా బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్ల రేంజ్ లో వసూళ్లను కొల్లగొట్టింది. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. టాలీవుడ్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. రాజమౌళి ఇండియాలోనే నెం.1 దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా బాహుబలికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ కు ధీటైన ప్రతినాయకుడిగా భళ్లాలదేవ పాత్రలో రానా దగ్గుబాటి యాక్ట్ చేశాడు. రానా తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. భళ్లాలదేవగా నేను తప్పా మరెవరూ సరిపోరు అనేంత అద్భుతంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. బాహుబలి సిరీస్ లో భళ్లాలదేవ క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ రానా కాదట. మొదట ఓ హాలీవుడ్ నటుడిని తీసుకోవాలని భావించారట.
ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా రివీల్ చేశాడు. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రాజమౌళిపై మోడ్రన్ మాస్టర్స్ టైటిల్ తో ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి బాహుబలి మూవీకి సంబంధించి పలు విషయాలు పంచుకున్నారు. అందులో భాగంగానే భళ్లాలదేవ పాత్రకు మొదట అనుకున్నది ఎవర్నో రాజమౌళి బయటపెట్టారు.
బాహుబలిగా ప్రభాస్ ఫిక్స్ అయిన తర్వాత.. ఆ కటౌట్ కు సరిపడే విలన్ పాత్ర కోసం రాజమౌళి అండ్ టీమ్ చాలా రీసెర్చ్ చేసిందట. బాగా ఆలోచించి ఆక్వామెన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న హాలీవుడ్ నటుడు జేసన్ మమోవాను భళ్లాలదేవ పాత్రకు ఎంపిక చేయాలని భావించారు. అతన్ని కాంటాక్ట్ అవ్వాలని కూడా డిసైడ్ అయ్యారు. అయితే ఇంతలో నిర్మాత శోభు యార్లగడ్డ మన టాలీవుడ్ లో ప్రభాస్‌కు తగిన హైట్, వెయిట్ కలిగిన వ్యక్తులు ఎవరున్నారని పరిశీలించగా రానా కనిపించాడట. వెంటనే రాజమౌళికి రానా పేరు సూచించగా.. ఆయన నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత శోభు స్వయంగా రానాను కలిసి కథ చెప్పి భళ్లాలదేవ పాత్రకు ఒప్పించడం జరిగిందని రాజమౌళి పేర్కొన్నారు.