కరోనా ఎవరెవరినో ఆపింది గాని దగ్గుబాటి రానాను ఆపలేకపోయింది. కరోనాను, లాక్ డౌన్ ను రానా చక్కగా వాడేసుకున్నాడు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత క్షణం ఖాళీ లేకుండా ప్లాన్ చేసి మెల్లగా యుట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాడు.
యుట్యూబ్ ఛానెల్ అంటే ఏదో తాను మాట్లాడింది పెట్టడానికి, తన ప్రోమోలు, పాటలు, ట్రైలర్లు పెట్టడానికి కాదు. యుట్యూబ్ కోసం ఏకంగా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టేశాడు. కొత్తవాళ్లకు అవకాశాలు ఇస్తాడట. అన్ని భాషల్లో వీడియోలు తీస్తాడట. సెలబ్రిటీలను మన ముందుకు తీసుకువస్తాడట. అన్నీ ఇన్నీ కాదు, మొత్తం చేసేస్తాడట.
10 సెకెండ్ల నుంచి 10 గంటల నిడివి ఉన్న ఏ వీడియోలు అయినా పెట్టేస్తా, మిమ్మల్ని అలరిస్తా అంటున్నాడు రానా. తెలివైన పని. ఒక బ్యానర్ మొదలుపెట్టి దాంట్లో పెట్టుబడి పెట్టి, సినిమాలు తీసి అవి హిట్టో ఫట్టో టెన్షన్ పడటం కంటే ఇది చాలా బెటర్. తనకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని పరిచయాలు ఉన్నాయి. తన బ్రాండ్ ను తాను వాడుకుని గూగుల్ తో తెగ సంపాదించే ప్లానేశాడు.
రకరకాల టాక్ షోలు, ఇంటర్వ్యూలు, కళాపోషణ, కామెడీ బోలెడు ఉంటాయి. రెడీగా ఉండండి. అవును ఛానెల్ పేరేంటో తెలుసా… SOUTHBAY !