ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. ‘మావాడు అని తెలుగువారంతా గర్వంగా చెప్పుకునే మహానటుడు, మహా నాయకుడు నందమూరి తారకరామారావు. వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్ ది విలక్షణమైన వ్యక్తిత్వం. క్షేత్రస్థాయిలో, అంత్యోదయ మార్గంలో ఎన్టీఆర్ పరిపాలన సాగింది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిలిచిన ఆయన పాలన ఆదర్శంగా నిలిచింది. ఆ మహానాయకుడి స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకోవాలి. నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలి’ అని వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
వెండి తెరపై నవరసాలు పండించిన మహానటుడు, అశేష అభిమానుల హృదయసీమను అవిఘ్నంగా ఏలిన మహానాయకుడు ఎన్టీఆర్ అని ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆ మహామనిషి శత జయంతి సందర్భంగా అందరికీ హార్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నానని రామోజీ రావు అన్నారు. ఎన్టీఆర్ తెలుగు నేలపై ప్రభవించడం తెలుగువారిగా మనందరి అదృష్టమని, కృషి, దీక్ష, పట్టుదలకు ప్రతీకగా, నియమ నిష్టలకు, క్రమశిక్షణకు మారుపేరుగా ఆఖరి క్షణం వరకు జీవితాన్ని సాగించిన వికసిత వ్యక్తిత్వం ఆయనదని కొనియాడుతూ రామోజీ రావు ఓ లేఖ విడుదల చేశారు.
ఇక, అన్నగారి శత జయంతి సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావు ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. “నేను కాలేజ్ రోజుల్లో అన్నగారి పౌరాణికాలు .. జానపదాలు బాగా చూసేవాడిని. రాముడిగా .. కృష్ణుడిగా … రావణుడిగా ఆయన అనేక పాత్రలను పోషించారు. అప్పటి నుంచి నేను ఆయన అభిమానిగా మారిపోయాను. అసలు ఎప్పటికైనా ఆయనతో సినిమా చేయగలమా అనుకున్నాను. అలా అనుకున్న నాకు భగవంతుడి దయవలన అసిస్టెంట్ డైరెక్టర్ గా ‘పాండవ వనవాసం’ సినిమాకి అన్నగారిపై క్లాప్ కొట్టే అవకాశం లభించింది. నిజంగా నేను ఎంతో అదృష్టవంతుడినని అనుకున్నాను.
ఆ తరువాత ‘అడవి రాముడు’ సినిమాతో ఆయన నాకు దర్శకుడిగా అవకాశమిచ్చారు. ఆ సినిమాతో దర్శకుడిగా నా భవిష్యత్తుకు బంగారు బాటవేశారు .. ఆయన రుణాన్ని నేను ఎప్పుడూ తీర్చుకోలేను. అంతే కాకుండా ‘డ్రైవర్ రాముడు’ .. ‘వేటగాడు’ .. ‘ జస్టీస్ చౌదరి’ .. ‘కొండవీటి సింహం’ ఆఖరి చిత్రమైన ‘మేజర్ చంద్రకాంత్’ చేసే భాగ్యం కూడా నాకు కలిగింది. షూటింగు సమయంలో ఆయనతో గడిపిన క్షణాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను” అంటూ దర్శకేంద్రుడు భావోద్వేగంతో ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్ తో కలిసి నటించిన సీనియర్ నటి ప్రభ..అన్నగారితో నటించిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. “నిజానికి ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడేంత వయసు .. అనుభవం నాకు లేవు. రామకృష్ణ సినీ స్టూడియోస్ లో మొదటిసారిగా ఆయన ‘దాన వీర శూర కర్ణ’ సినిమాను నిర్మించారు. ఆ స్టూడియో ఓపెనింగ్ హీరోయిన్ నేను అయినందుకు నాకెంతో గర్వంగా అనిపించింది.
100 సినిమాల్లో నటిస్తే ఎంత పాపులారిటీ వస్తుందో .. ఎన్టీఆర్ సరసన నాయికగా ‘ఒక్క సినిమా చేసిన నాకు అంతే పాప్యులారిటీ వచ్చింది. ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలోని ‘చిత్రం.. భళారే విచిత్రం’ సాంగ్ అప్పటికీ .. ఇప్పటికీ సూపర్ హిట్. ఆ సినిమాకి .. ఆ పాటకి ఎంతటి ఆదరణ లభించిందనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
రామారావుగారి గురించి ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం ఆయన కారణజన్ముడు. రాముడిగా .. కృష్ణుడిగా ఆయన ధరించిన పాత్రలను చూస్తూ పెరిగిన నేను, ఆయన పక్కన హీరోయిన్ గా చేస్తానని అస్సలు అనుకోలేదు. అలాంటి అవకాశం రావడం నిజంగా నా అదృష్టం” అని ప్రభ అన్నారు.