ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని నిర్మాణానికి నడుం బిగించారు. ఈ రాజధానికి అమరావతి అని నామకరణమూ చేశారు. ఈ పేరు ప్రజలందరికీ త్వరగానే చేరువైంది. అయితే ఏపీ రాజధానికి అమరావతి అనే పేరు పెట్టమని రామోజీ రావే సూచించారు. ఈ విషయాన్ని గతంలో బాబు వెల్లడించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీడియా మొఘల్‌గా పేరు పొందిన రామోజీ గ్రూప్ సంస్థల అధినేత, ఈనాడు సృష్టికర్త రామోజీ రావు శనివారం (జూన్ 8) ఉదయం అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతి పట్ల రాజకీయ, సినిమా, పాత్రికేయ తదితర రంగాల వాళ్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. రామోజీ రావు దార్శనికత, పట్టువిడవని నైజం, ఎవరికీ తలవంచని తీరు గురించి తలుచుకుంటూ కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రామోజీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ఆ సందర్భంగా ఏపీ రాజధానికి అమరావతి పేరు బాగుంటుందని రామోజీరావు సూచించారని చంద్రబాబు గతంలో పేర్కొన్న వీడియోను టీడీపీ ట్వీట్ చేసింది. రాజధానికి ఏ పేరు పెడితే బాగుంటుందని తాను చాలా ఆలోచించానని, చాలా మంది చాలా పేర్లు చెప్పారని ఆ వీడియోలో బాబు తెలిపారు. రామోజీ రావు పరిశోధన చేసి అమరావతి పేరు బాగుంటుందని చెప్పారని, దీనిపై అందరి అభిప్రాయం స్వీకరించి రాజధానికి అదే పేరు పెట్టామని బాబు పేర్కొన్నారు.