ఏపీ అధికార పార్టీ కీలక నాయకుడు, మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డిపై తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు అందింది. పెద్దిరెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ.. ఆధారాలతో సహా ఫిర్యాదు అందించానని ఇటీవల భారత చైతన్యయువజన పార్టీ పేరుతో నూతన రాజకీయపార్టీ పెట్టిన మాజీ జనసేన పార్టీ నాయకుడు రామచంద్రయాదవ్ తెలిపారు. తాజాగా ఆయన హోం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు చేస్తున్నారంటూ.. సుమారు 72 పేజీల ఫిర్యాదును అందించారు.
రామచంద్రయాదవ్ చెప్పిన దాని ప్రకారం.. పెద్దిరెడ్డి సుమారు రూ.35 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో రూ.35 వేల కోట్ల దోపిడీ చేశారని పెద్దిరెడ్డిపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానంగా మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కంపెనీపై 160 క్రిమినల్ కేసులున్నాయని పేర్కొన్నారు. 17 మంది డైరెక్టర్ల ద్వారా సూట్ కేసు కంపెనీలు సృష్టించి అవినీతిని దాచే ప్రయత్నం చేస్తున్నారని నివేదికలో వివరించారు. ఎన్నికల అఫిడవిట్లోనూ .. అనేక తప్పులు ఉన్నాయని తెలిపారు.
2019 ముందు ఉన్న ఆస్తుల వివరాలు పెద్దిరెడ్డి దాచిపెట్టారని రామచంద్రయాదవ్ తెలిపారు. పెద్దిరెడ్డిపై అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈడీ ద్వారా దర్యాప్తు జరిపి పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిని కోరినట్టు ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ.. రామచంద్రయాదవ్ తెలిపారు. ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మోసం చేశారని.. భవిష్యత్‌లో న్యాయపోరాటం చేస్తానని ఆయన చెప్పారు. సీమ రాజకీయాల్లో పెద్దిరెడ్డి సంపాయించుకున్న ఆస్తులు ఎవరికీ లేవన్నారు. ఇప్పుడు ఆయనను ప్రశ్నించేవారిపైనా దాడులు చేస్తున్నారని.. ఆరోపించారు. భవిష్యత్తులో పెద్దిరెడ్డి తల ఎత్తుకోకుండా చేస్తానన్నారు.