యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ల కాంబోలో దర్శక ధీరుడు ‘మహారాజ’మౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించిన సంగతి తెలిసిందే. తారక్, చెర్రీలు నువ్వా నేనా అన్నట్లు పోటీపడి నటించడం…రాజమౌళి మరోసారి తన మార్క్ డైరెక్షన్ తో మెప్పించడంతో ఈ చిత్రం అమెరికా సహా ఓవర్సీస్ లోని ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఈ సినిమాతో చెర్రీ, తారక్ లు పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్ హీరోలుగా మారిపోయారు.
చెర్రీ నటనకు నార్త్ ఆడియన్స్ తో పాటు హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఆ చిత్రంలో చరణ్ ఇంట్రడక్షన్ సీన్ తో పాటు క్లైమాక్స్ సీన్ లలో చెర్రీ నటన అద్భుతంగా ఉందని అందరూ కితాబిస్తున్నారు. చెర్రీ నటనకు ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ ‘ఇన్ సైడర్’ కరస్పాండెంట్ కిర్ స్టెన్ కూడా ముగ్ధురాలయ్యారు. ఈ చిత్రంలో చరణ్ నటన చూసి తాను ఫ్యాన్ గా మారిపోయానని స్వయంగా ఆమె ట్వీట్ చేశారు. ఇక, హాలీవుడ్ లో రూపొందుతున్న ఒక పాపులర్ వెబ్ సిరీస్ లో నటించే చాన్స్ చెర్రీకి వచ్చిందని, దానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ టాక్.,
ఈ పుకార్లు ఇలా ఉండగానే తాజాగా అమెరికా టీవీ సిరీస్ మేకర్ చియో హోడారి కోకర్…చరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా పాపులర్ అయి జేమ్స్ బాండ్ పాత్రకు చరణ్ సరిగ్గా సరిపోతాడని ఆయన కితాబిచ్చాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటుల్లో ఎవరు తదుపరి జేమ్స్ బాండ్ కు సరిపోతారన్న ప్రశ్నకు ఆయన రామ్ చరణ్ తో పాటు మరో ముగ్గురు అంతర్జాతీయ నటుల పేర్లు చెప్పారు.
పియర్స్ బ్రాస్నన్ తర్వాత డేనియల్ క్రెగ్ జేమ్స్ బాండ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, డేనియల్ క్రెగ్ ఇకపై బాండ్ గా కనిపించబోరని, ఆయన స్థానంలో మరొకరు రావొచ్చని టాక్ ఉంది. ఈ క్రమంలోనే డేనియల్ క్రెగ్ తరహాలో బాండ్ పాత్రకు న్యాయం చేసే పలువురి నటుల పేర్లను కోకర్ వెల్లడించారు. బాండ్ స్థాయి పాత్రకు ఇద్రిస్ ఎల్బా, సోప్ దిరిసు, మాథ్యూ గూడే, డామ్సన్ ఇద్రిస్ లతోపాటు రామ్ చరణ్ పేరు కూడా సూచించడం తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ భారత సినీ పరిశ్రమ గర్వించదగ్గ విషయం.
ఇద్రిస్ ఎల్బా గురించి అందరికీ తెలిసిందేనని, ‘గాంగ్స్ ఆఫ్ లండన్’ లో సోప్ నటన భేషుగ్గా ఉందని, ‘ది ఆఫర్’ చిత్రంలో మాథ్యూ గూడే అద్భుతంగా నటించాడని తెలిపారు. ‘స్నోఫాల్’ చిత్రంలో డామ్సన్ ఆకట్టుకోగా, ‘ఆర్ఆర్ఆర్’ లో రామ్ (రామ్ చరణ్) మెరుగైన నటన కనబర్చాడని కితాబిచ్చారు. వీరందరికీ జేమ్స్ బాండ్ ధరించే సవిల్లే రో సూట్ ధరించడానికి, వాల్తర్ పీపీకే పిస్టల్ పట్టుకోవడానికి అర్హత ఉందని కోకర్ వివరించారు. ఈ విషయం తెలిసిన చెర్రీ, మెగా ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు, కోలీవుడ్ కింగ్ లకు దక్కని ప్రశంస చెర్రీకు దక్కడం గర్వకారణమని అంటున్నారు.