యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ల కాంబోలో దర్శక ధీరుడు ‘మహారాజ’మౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్లపైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మరోసారి తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రముఖ ఓటీటీ జెయింట్ నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ రోజులు ట్రెండింగ్లో ఉన్న చిత్రంగానూ ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది.
తారక్, చెర్రీలు నువ్వా నేనా అన్నట్లు పోటీపడి నటించడం…రాజమౌళి దర్శకత్వ ప్రతిభ..వెరసి ఈ చిత్రం హాలీవుడ్ తోపాటు ఓవర్సీస్ లోని ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ఈ సినిమాతో చెర్రీ, తారక్ లు పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్ హీరోలుగా మారిపోయారు. ఇక, ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరీలో జూ.ఎన్టీఆర్ పేరు నామినేట్ అయ్యే అవకాశముందని వెరైటీ ఎడిషన్ మ్యాగజైన్ వెల్లడించిన సంగతి తెలిసిందే..
ప్రతి ఏడాది ఆస్కార్ బరిలో నిలిచే అవకాశాలున్న ఉత్తమ నటీ నటులు, దర్శకులు..ఆయా కేటగిరీల జాబితాను వెరైటీ ఎడిషన్ అనే మ్యాగజైన్ అంచనా వేసి చెబుతుంది. ఈ క్రమంలోనే 2023కు గాను బెస్ట్ యాక్టర్ విభాగంలో ఆసియా నుండి ఎన్టీఆర్ పేరును ఆస్కార్ అవార్డులకు ఆ మ్యాగజైన్ ప్రెడిక్ట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రంలో అద్భుతంగా నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరును కూడా తాజాగా ఈ మ్యాగజైన్ ప్రెడిక్ట్ చేసింది. బెస్ట్ యాక్టర్ కేటగిరీలో చెర్రీ పేరు రావడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇక, ఉత్తమ విదేశీ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ దర్శకుడి కేటగిరీలో ఎస్ఎస్ రాజమౌళి పేరు కూడా ఉంది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో ‘దోస్తీ’ సాంగ్ ను ఈ మ్యాగజైన్ ప్రెడిక్ట్ చేసింది.