ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజై 40 రోజులు కావస్తోంది. మామూలుగా అయితే ఈపాటికి ఈ చిత్ర థియేట్రికల్ రన్ ముగిసిపోవాలి. కేజీఎఫ్-2 వచ్చాక ఆర్ఆర్ఆర్ జోరు బాగా తగ్గేసరికి దాని పనైపోయిందనే అనుకున్నారంతా. చిత్ర బృందం కూడా థియేట్రికల్ రన్ ముగిసిందనే భావనతోనే ఈ చిత్రం నుంచి ఒక్కో వీడియో సాంగ్ రిలీజ్ చేయడం మొదలుపెట్టింది. కానీ ఆర్ఆర్ఆర్ అయిదో వారంలోనూ ఇంకా ప్రభావాన్ని కొనసాగిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఆదివారం ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల కొన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. తిరుపతి, విజయనగరం, వైజాగ్ లాంటి నగరాల్లో హౌస్ ఫుల్ అయిన థియేటర్ల విజువల్స్ సోషల్ మీడియాలో కనిపించాయి. ఈ సినిమా ఇంకా ఇలాంటి ప్రభావం చూపిస్తుండటం ఇటు రామ్ చరణ్ అభిమానులు, అటు తారక్ ఫ్యాన్స్‌కు ఆనందాన్నిచ్చే విషయమే.
కానీ చరణ్ అభిమానులు పూర్తిగా ఈ ఆనందాన్ని ఆస్వాదించలేని పరిస్థితి. ఎందుకంటే చరణ్ నటించిన పాత సినిమా ఇంకా అలాంటి ప్రభావాన్ని చూపిస్తుంటే.. అతను నటించిన కొత్త చిత్రం ఆచార్య బాక్సాఫీస్ దగ్గర తేలిపోతోంది. ఈ చిత్రానికి తొలి వీకెండ్లో కూడా హౌస్ ఫుల్స్ కరవయ్యాయి.
ఆదివారం ఈ చిత్రానికి చాలా చోట్ల సరైన ఆక్యుపెన్సీ లేదు. శనివారం లాగే ఆదివారం కూడా ఈ చిత్రం అండర్ పెర్ఫామ్ చేసినట్లే కనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ ఇంకా ప్రభావం చూపిస్తుంటే.. ఆచార్య పరిస్థితి ఇలా తయారవడంతో మిశ్రమానుభూతిని కలిగించేదే. అసలు ఆర్ఆర్ఆర్ చరణ్ అభిమానులకు మామూలు హై ఇవ్వలేదు.
దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగిపోవడం, సినిమాలో అతడి పాత్ర బాగా హైలైట్ కావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకపోయాయి. కానీ ఆచార్య ఆ హైని దెబ్బ కొట్టింది. ఆనందం ఆవిరయ్యేలా చేసింది. ఇది ఒక చిత్రమైన, అరుదైన పరిస్థితి అనే చెప్పాలి.