గడిచిన కొద్ది రోజులుగా ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన నిందితుడు రాజు వ్యవహారం పెను సంచలనంగానే కాదు.. రాజకీయ.. సినిమాతో సహా పలు వర్గాల్ని కదలించింది. ఈ ఉదంతం గురించి తెలిసిన ప్రతిఒక్కరి కంట కన్నీరు ఒలికే పరిస్థితి.
చాక్లెట్ ఆశ చూపించి హత్యాచారం చేసిన వైనంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దారుణ ఘటనకు బాధ్యుడైన రాజు డెడ్ బాడీని తాజాగా ఘట్ కేసర్ రైల్వే ట్రాక్ మీద గుర్తించినట్లుగా చెబుతున్నారు. రాజు చేతి మీద ‘‘మౌనిక’’ అన్న పచ్చబొట్టు ఉన్న నేపథ్యంలో.. తాను చేసిన తప్పునకు శిక్షగా తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ నెల తొమ్మిదిన సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన ఆరేళ్ల చిన్నారిపై దారుణ అత్యాచారానికి పాల్పడి..బాధతో అరుస్తుందని గొంతు పిసికి చంపేసిన వైనం తెలిసిందే. అనంతరం స్థానికులకు అతని మీద అనుమానం కలిగేసరికి.. అతను కాస్తా తప్పించుకుపోయాడు. అతన్ని అదుపులోకి తీసుకోవటానికి వేలాది మంది పోలీసులు గడిచిన నాలుగైదు రోజులుగా గాలిస్తున్నారు. అయినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. మరోవైపు.. ఆరేళ్ల చిన్నారి ఉదంతం కేసీఆర్ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది.
ఘటన జరిగిన రెండు మూడు రోజులకే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అనంతరం.. తాను పొరపాటున ట్వీట్ చేశానని చెప్పిన ఆయన.. నిందితుడి కోసం పెద్ద ఎత్తున గాలింపు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. అతన్ని గుర్తించిన వారికి రూ.10లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఉదంతంపై రాజకీయ పక్షాలతో పాటు.. సినిమా రంగానికిచెందిన పలువురు పెద్ద ఎత్తున ఖండించటంతో పాటు.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఇదిలా ఉంటే.. ఈ రోజు (గురువారం) ఉదయం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న వేళ.. ఘట్ కేసర్ రైల్వే ట్రాక్ వద్ద గుర్తు తెలియని డెడ్ బాడీని గుర్తించారు. అయితే.. మరణించిన వ్యక్తి చేతి మీద మౌనిక అంటూ పచ్చబొట్టు ఉన్న ఆధారంగా అతను చిన్నారిని చిదిమేసిన నిందితుడు రాజుగా గుర్తించారు. దీంతో సైదాబాద్ హత్యాచార ఘటన కంచికి చేరినట్లైంది.