జగన్ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్ లు నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం పని చేస్తున్న డీజీపీ , సీఎస్ ల పరిస్థితి ముందునుయ్యి..వెనుక గొయ్యి అన్న చందంగా తయారయిందని టాక్ ఉంది. జగన్ చెప్పినట్టు వినకపోతే ఒకతంటా ఒకవేళ ఆయన చెప్పినట్టు చేస్తే కోర్టులతో మరో తంటలా పరిస్థితి తయారైందని ప్రతిపక్ష నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
జగన్ చలవ వల్ల గతంలో ఏపీ డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ నాలుగు సార్లు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఆ తర్వాత సవాంగ్ నుంచి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఆ పరంపర కొనసాగిస్తున్నారు. గతంలో రేషన్ బియ్యం అక్రమ తరలింపు చేస్తున్నారన్న ఆరోపణలతో మిల్లర్ల వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారన్న కేసులో రాజేంద్రనాథ్ రెడ్డి కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది.
ఆ తర్వాతైనా రాజేంద్రనాథ్ రెడ్డి కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి రాకుండా చూసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, తాజాగా పోలీసు ఇన్స్పెక్టర్ పదోన్నతి వ్యవహారంలో దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో మరోసారి రాజేంద్రనాథ్ రెడ్డి కోర్టు మెట్లెక్కారు. కోర్టు ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇక, ఇదే కేసులో మాజీ డీజీపీ, ప్రస్తుత ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే, ఓ సమావేశం కోసం కేరళ వెళ్లడంతో ఆయనకు మినహాయింపునిచ్చారు.
విజయనగరం జిల్లా పోలీస్ ట్రైనింగ్ కళాశాల ఇన్స్పెక్టర్ సీహెచ్ రాజశేఖర్‌కు జీవో 257 ప్రకారం పదోన్నతి కల్పించాల్సి ఉంది. దాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రమోషన్ ఇవ్వాలని 24 సెప్టెంబరు 2019లో హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలు అమలుకాకపోవడంతో రాజశేఖర్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన కోర్టు మాజీ డీజీపీ గౌతం సవాంగ్, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిలను విచారణకు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది.