పుష్ప సినిమాలో హీరో ఎర్ర చందనం స్మగ్లర్. ఇలాంటి పాత్రను ఎలివేట్ చేసి చూపించడం మీద కొంతమందికి అభ్యంతరాలున్నాయి. ప్రముఖ ప్రవచనకారులు గరికపాటి నరసింహారావు గతంలో ఈ సినిమా మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ను హీరోగా చూపించి, సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ సినిమాకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకుంటే.. ఇలాంటి పాత్రకు పురస్కారం ఏంటి అంటూ చాలామంది ప్రశ్నించారు.
తాజాగా లెజెండరీ నటుడు రాజేంద్ర ప్రసాద్.. ‘పుష్ప’ సినిమా పేరెత్తకుండా చందనం దొంగ హీరో అంటూ కౌంటర్ వేశారు. ఆయన కీలక పాత్ర పోషించిన ‘హరికథ: సంభవామి యుగే యుగే’ హాట్ స్టార్ ద్వారా రిలీజవుతున్న నేపథ్యంలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఐతే పర్టికులర్గా ‘పుష్ప’ సినిమాను నిందించకుండా ఇప్పుడు హీరో పాత్రలకు నిర్వచనం మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ఈ మధ్యే చూశాం.. వాడెవడో చందనం దొంగ హీరో.. ఇప్పుడు హీరో అంటే మీనింగ్ మారిపోయింది. చెడు లక్షణాలు ఉన్న వాళ్లే హీరోలు’’ అని రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఐతే తాను కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రల్లో నటించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పుల అప్పారావు, పేకాట పాపారావు, ఏప్రిల్ 1 విడుదల లాంటి సినిమాల్లో హీరో ఉత్తముడు కాదని.. వాళ్లందరూ వెధవలే అని రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు.
మనం అక్కడ పాత్రను మాత్రమే చూడాలని.. మన చుట్టూ ఉన్న వ్యక్తుల్లోంచే ఈ పాత్రలు పుడతాయని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తాను ఎన్టీఆర్-ఏఎన్నార్.. కృష్ణ-శోభన్ బాబు.. చిరంజీవి-బాలకృష్ణ.. మహేష్ బాబు-జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పేరు తెలియని యంగ్ హీరోలు.. ఇలా ఐదు తరాల నటులతో కలిసి పని చేశానని.. ఇంత ప్రయాణం తర్వాత ఎప్పుడో ఎన్టీఆర్ చేసిన పాత్రను ‘హరికథ’లో చేయడం తన అదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. తన మీద ఇలాంటి కథ రావడం తాను ఊహించలేదని చెప్పారు.