రాజీవ్ గాంధీ హంత‌కుల విడుద‌ల‌!?

దేశ మాజీ ప్ర‌ధాని.. భార‌త్‌లో ఐటీ రంగానికి పునాదులు వేసిన‌ రాజీవ్ గాంధీని అత్యంత అమానుషంగా హ‌త్య‌చేసిన హంత‌కుల‌ను జైలు నుంచి విడుద‌ల చేసేందుకు రంగం సిద్ధ‌మైంది. రాజీవ్  హత్యకేసులో మొత్తం ఏడుగురు జైలు శిక్ష అనుభ‌విస్తున్నారు. 1991, మే 21 న త‌మిళ‌నాడులోని శ్రీపెరుంబ‌దూర్ ప్రాంతంలో జ‌రిగిన ఎన్నిక‌ల స‌భ‌లో పాల్గొనేందుకు వ‌చ్చిన రాజీవ్‌పై మ‌హిళా బాంబ‌ర్‌.. దాడి చేసి పొట్ట‌న పెట్టుకున్న విష‌యం అప్ప‌ట్లో ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కేసులో ప‌ట్ట‌బ‌డిన పేరరివాలన్‌, మురుగన్‌, నళిని, శాంత, జయకుమార్‌, రాబర్ట్‌ ఫయాజ్‌, రవిచంద్రన్‌లు సుదీర్ఘ విచార‌ణ త‌ర్వాత‌.. జీవిత ఖైదును అనుభ‌విస్తున్నారు.

అయితే.. దాదాపు 30 ఏళ్లుగా జైల్లో ఉన్న వీరిని విడుద‌ల చేసేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల వుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాజీవ్‌గాంధీ స‌తీమ‌ణి, కాంగ్రెస్ అధినేత సోనియా స‌హా.. గాంధీల కుటుం బం కూడా ఈ ముద్దాయిల విడుద‌ల‌కు ఆటంకాలు చెప్ప‌లేదు. పైగా కొన్ని సంద‌ర్భాల్లో రాజీవ్ కుమార్తె ప్రియాంక‌గాంధీ.. ప‌లువురు ముద్దాయిల‌తో ఇంట‌ర్వ్యూ కూడా తీసుకున్నారు. అయితే.. ప‌లు కార‌ణాల నేప‌థ్యంలో కేంద్ర హోం శాఖ‌.. వీరి విడుద‌ల‌ను నిలుపుద‌ల చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ముద్దాయిల విడుద‌ల అంశం సుప్రీం కోర్టు ప‌రిధిలో ఉన్నందున గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకుంటే.. విడుద‌ల‌కు మార్గం సుగ‌మ‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు.

అయితే.. త‌మిళ‌నాట ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. రాజీవ్ హంత‌కుల విడుద‌ల అంశం చ‌ర్చ‌నీయాం శంగా మారుతోంది. తాజాగా మ‌రోసారి.. హంత‌కుల విడుద‌ల అంశాన్ని సీఎం ప‌ళ‌నిస్వామి లేవ‌నెత్తారు. ముద్దాయిలను విడుదల చేయాలని కోరుతూ.. ఆయ‌న గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ను అభ్యర్థించారు. నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం ప‌ళ‌ని.. ముద్దాయిల విడుద‌ల‌పై గతంలో  చేసిన  తీర్మానం విష‌యాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీం కోర్టులో ఉన్నందున గవర్నర్‌ నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం పరిగణన‌లోకి తీసుకుంటుంద‌ని.. కాబట్టి.. వారిని విడుదల చేస్తూ ఉత్తర్వులివ్వాలని అభ్యర్ధించారు.  

ఈ క్ర‌మంలో రాజీవ్ హంత‌కుల విడుద‌ల‌పై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ఉద్దేశం ఏంటో తెలుసు కునేందుకు గవర్నర్‌ కార్య దర్శి ఆనంద్‌రావ్‌ విష్ణుపాటిల్‌ ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన అటార్నీ జనరల్‌తో పాటు కేంద్ర న్యాయనిపుణులతో భేటీ అయ్యారు. వారి విడుదలకు వున్న అడ్డంకులు, వారిని విడుదల చేస్తే మున్ముందు ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలపై ఆయన చర్చించారు. అదే విధంగా కేంద్రప్రభుత్వ ఉద్దేశం గురించి కూడా అటార్నీ జనరల్‌తో చర్చించారు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చాక గవర్నర్ ఒకటి రెండు రోజుల్లో రాజీవ్ హంత‌కుల‌విడుద‌ల పై నిర్ణయం వెలువ రించవచ్చు.  ఈ సారి ఖ‌చ్చితంగా విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని.. రాజ‌కీయ నేత‌లు సైతం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.