దాదాపు 32 ఏళ్ల క్రితం విడుదలైన ‘అంకుశం’ అప్పట్లో ఒక సంచలనం. రాజశేఖర్ ఇమేజ్ ను భారీగా పెంచేయటమే కాదు. యాంగ్రీ యంగ్ మెన్ గా పేరును తీసుకొచ్చింది. ఈ సినిమాలో రాజశేఖర్ ముక్కుసూటి పోలీసు అధికారిగా నటించటం తెలిసిందే. మిలియనీయం తరానికి అంకుశం మూవీకి తెలిసింది తక్కువే. ఆ సినిమా విడుదలైన వేళ..టికెట్ల కోసం పడిన పాట్లు అన్ని ఇన్ని కావు. ఇక.. ఈ సినిమాతో రామిరెడ్డి అనే విలన్ తెలుగు తెరకు పరిచయం కావటమే కాదు.. అప్పటివరకు విలన్ అనే దానికి భిన్నమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.
ఈ సినిమాలో హైలెట్ సీన్ ఏమంటే.. విలన్ రామిరెడ్డిని పోలీసు అధికారి అయిన రాజశేఖర్ కొట్టుకుంటూ తీసుకురావటం.. చార్మినార్ వద్ద తీసిన ఈ సీన్.. అప్పట్లో పెను సంచలనమైంది. ఈ సీన్ గురించి అందరూ మాట్లాడుకునేవారు. అయితే.. ఈ సీన్ షూట్ కోసం రామిరెడ్డిని నిజంగానే కొట్టాల్సిన వచ్చింది. అలా ఎందుకు జరిగింది? అని రాజశేఖర్ ను తాజాగా చేసిన ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు.. ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
‘రామిరెడ్డి సున్నిత మనస్కులు. ఎవరైనా ఏమైనా మాట అంటే పడేవారు కాదు. అయితే.. చార్మినార్ వద్ద కొట్టుకుంటూ తీసుకెళ్లే సీన్ ఆయనకు అస్సలు ఇష్టం లేదు. కానీ.. షూట్ లో భాగంగా ఆయన చేయాలి. షూట్ లో భాగంగా నేను ఆయన్ను కొట్టినట్లు నటిస్తున్నా. ఆయన మాత్రం అస్సలు కదలట్లేదు. చూసేవాళ్లు ఏమ అనుకుంటారేమోనని.. దెబ్బ తగలనట్లుగా ఉండిపోయారు. దీంతో దర్శకుడు కోడిరామక్రిష్ణ వచ్చి ఆయన్ను.. నిజంగానే కొట్టమని నాకు చెప్పారు. కొడితే కానీ నటించడేమోనని నిజంగానే కొట్టేశా. అప్పుడు కదిలారు. ఆయనకు ఆ సీన్ చేయటం అస్సలు ఇష్టం లేకున్నా.. ఆ సినిమాకే ఆ సీన్ హైలెట్ గా నిలిచింది’’ అంటూ అప్పటి విషయాల్ని వెల్లడించారు రాజశేఖర్.